నేను సాయం చేస్తున్నా.. మీరు ముందుకు రండి: పంత్‌

8 May, 2021 16:45 IST|Sakshi

ఢిల్లీ: దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజుకు నాలుగు లక్షలకు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశంలో ఆక్సిజన్‌ కొరతతో రోజు వందల మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు తమకు తోచిన సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆసీస్‌ క్రికెటర్‌ పాట్‌ కమిన్స్‌ మొదలుకొని.. సచిన్‌, రహానే, పాండ్యా బ్రదర్స్‌, బ్రెట్‌ లీ, ఇంకా ఎందరో క్రికెటర్లు విరాళాలు.. ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్లు అందించి తమ ఉదారతను చాటుకున్నారు. తాజాగా టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ హేమకుంత ఫౌండేషన్ ద్వారా కోవిడ్‌ రోగులకు సాయం అందించనున్నట్లు తెలిపాడు. కరోనా రోగుల కోసం అవసరమైన ఆక్సిజన్‌ సిలిండర్లు, బెడ్లు, అవసరమైన మందులు అందించనున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాక గ్రామీణ ప్రాంతాలతో పాటు నాన్‌ మెట్రో నగరాల్లో మెడికల్‌ సపోర్ట్‌ అందించనున్న ఆర్గనైజేషన్‌లకు తనకు తోచిన సాయం అందించనున్నట్లు పంత్‌ వివరించాడు. ఈ విషయాన్ని తన ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ఒక సుధీర్ఘ లేఖను రాసుకొచ్చాడు.

''హాయ్‌ ఫ్రెండ్స్‌.. ఇప్పుడు మనదేశం కరోనా సెకండ్‌వేవ్‌తో అల్లాడిపోతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోవిడ్‌ రోగులకు అండగా నిలబడాల్సి ఉంది. దేశంలో కరోనాతో వేలమంది చనిపోతున్నారు. వారు మనకేం కాకపోవచ్చు.. మనం బంధువులు.. స్నేహితులు అయితే వెంటనే స్పందించేవాళ్లం. కానీ ఒక భారతీయుడిగా మన సహచరులను కోల్పోతున్నవారి కుటుంబాలకు అండగా నిలబడాల్సిన సమయం ఇది. అందుకే నా వంతుగా  హేమకుంత ఫౌండేషన్ ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్లు, బెడ్స్‌, మందులు అందించడానికి ప్రయత్నిస్తున్నా. వాటితో కనీసం కొంతమంది ప్రాణాలైనా కాపాడొచ్చు. మీరు కూడా నాతో కలిసి వస్తే ఇంకా ఎందరి ప్రాణాలనో కాపాడొచ్చు. రండి అందరు ముందుకు రండి.. తోచినంత సాయం చేయండి. ఇక చివరిగా కోవిడ్‌ రూల్స్‌ను పాటిస్తూ అందరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.. వీలైతే తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకునేందుకు ప్రయత్నించండి.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక జూన్‌లో న్యూజిలాండ్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు టీమిండియా జట్టులో రిషబ్‌ పంత్‌ చోటు దక్కించుకున్నాడు. ఆసీస్‌తో సిరీస్‌ నుంచి భీకరమైన ఫామ్‌లో ఉన్న పంత్‌ ఇంగ్లండ్‌తో సిరీస్‌లోనూ అదే కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రేయాస్‌ అయ్యర్‌ స్థానంలో నాయకత్వం వహించిన పంత్‌ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. రెండు ఓటములతో పాయింట్ల పట్టికలో టాప్‌ స్థానంలో నిలిచింది.
చదవండి: పృథ్వీ షా ముందు బరువు తగ్గు.. ఆ తర్వాత చూద్దాం!

మరిన్ని వార్తలు