Rishabh Pant: పంత్‌ పని అయిపోయింది.. ఇక మిగిలింది అదే..!

12 Dec, 2022 19:44 IST|Sakshi

భావి భారత కెప్టెన్‌గా చిత్రీకరించబడి, అనతి కాలంలోనే ఏ భారత క్రికెటర్‌కు దక్కనంత హైప్‌ దక్కించుకుని, ప్రస్తుతం కెరీర్‌లో దుర్దశను ఎదుర్కొంటున్న రిషబ్‌ పంత్‌ను త్వరలోనే జట్టు నుంచి తప్పించబోతున్నారా..? అంటే ఔననే సమాధానమే వినిపిస్తుంది. తాజాగా పంత్‌ను వైస్‌ కెప్టెన్సీ (బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌) నుంచి తప్పించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తుంది.

బంగ్లాతో వన్డే సిరీస్‌కు సైతం పంత్‌ ఫిట్‌గానే ఉన్నప్పటికీ.. గాయం నెపంతో బీసీసీఐ కావాలనే పంత్‌ను పక్కకు పెట్టిందన్న ప్రచారం​ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి పంత్‌ను వైస్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన బీసీసీఐ.. మున్ముందు అతన్ని జట్టులో నుంచి పూర్తిగా తొలగిస్తుందని భారత క్రికెట్‌ వర్గాల్లో టాక్‌ నడుస్తుంది. 

బంగ్లాతో ఆఖరి వన్డే వరకు పంత్‌ (టీమిండియా వికెట్‌కీపర్‌ స్థానానికి)కు సంజూ శాంసన్‌ నుంచి మాత్రమే పోటీ ఉండేది. అయితే బంగ్లాతో మూడో వన్డేలో అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న ఇషాన్‌ కిషన్‌ మెరుపు డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో పంత్‌ కూసాలు కదలడం పక్కా అని తేలిపోయింది.

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో సంజూ, ఇషాన్‌ కిషన్‌ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న పంత్‌.. తనకు మంచి ట్రాక్‌ రికార్డు కలిగిన టెస్ట్‌ల్లో సైతం తన స్థానాన్ని ప్రమాదంలోకి పడేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అతనికి శ్రీకర్‌ భరత్‌ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బంగ్లాదేశ్‌తో టెస్ట్‌ సిరీస్‌కు పంత్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించిన మేనేజ్‌మెంట్‌.. తుది జట్టులో ఆడించడం కూడా కష్టమేనన్న పరోక్ష సంకేతాలు పంపింది. వరుస అవకాశాలు ఇచ్చినా పంత్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాడని గుర్రుగా ఉన్న బీసీసీఐ.. టెస్ట్‌ల్లో శ్రీకర్‌ భరత్‌ను పరీక్షించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ బంగ్లాతో తొలి టెస్ట్‌లో పంత్‌కు స్థానం లభించకపోతే, అతని కెరీర్‌ సమాప్తమైనట్టేనని క్రికెట్‌ అభిమానులు చర్చించకుంటున్నారు. పంత్‌ వ్యతిరేకులు అయితే.. అతని పని అయిపోయిందని, ఇక మిగిలింది అతన్ని జట్టు నుంచి గెంటివేయడమేనని బహిరంగ కామెంట్లు చేస్తున్నారు. భారత క్రికెట్‌ చరిత్రలో ఏ క్రికెటర్‌కు దక్కనన్ని అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేని పంత్‌కు ఇలాంటి శాస్తి జరగాల్సిందేనని శాపనార్ధాలు పెడుతున్నారు. 

మరిన్ని వార్తలు