రిషబ్‌ పంత్‌ హెల్త్‌ అప్‌డేట్‌.. పరిస్థితి ఏంటంటే..?

31 Jan, 2023 15:09 IST|Sakshi

Rishabh Pant Health Update: గతేడాది డిసెంబర్‌ 30న జరిగిన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్‌ అసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్‌ ఆటగాడు, యంగ్‌ వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌కు సంబంధించిన హెల్త్‌ అప్‌డేట్‌ ఇవాళ (జనవరి 31) విడుదలైంది. పంత్‌ మోకాలి సర్జరీ విజయవంతమైనట్లు డాక్టర్ల ప్రకటించారు. ఈ విషయంలో పాటు ఆసుపత్రి వర్గాలు మరో శుభవార్త కూడా చెప్పారు.

పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడని, ఈ వారంలోనే అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని వారు వెల్లడించారు. మార్చిలో పంత్‌కు మరో విడత మోకాలి సర్జరీ జరుగుతుందని, పంత్‌ పూర్తిగా కోలుకోవడానికి కనీసం 9 నెలల సమయం పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి కూడా ధృవీకరించారు. కాగా, గత నెలలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్‌లో పంత్‌ కుడి మోకాలిలో మూడు లిగ్మెంట్లు తెగిపోయిన విషయం తెలిసిందే. 

పంత్‌ బెడ్‌ రెస్ట్‌లో ఉండటంతో ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నీలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌, ఆతర్వాత జరిగే ఐపీఎల్‌, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌కప్‌లను పంత్‌ బెడ్‌పై నుంచే వీక్షించాల్సి ఉంటుంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌కు ప్రత్యామ్నాయం వెతుక్కునే పనిలో ఉండగా.. ఆసీస్‌ టెస్ట్‌ సిరీస్‌లో మాత్రం పంత్‌ లేని లోటు టీమిండియాపై పెను ప్రభావం చూపనుంది.  

మరిన్ని వార్తలు