Rishabh Pant: యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి నడిచిన రిషబ్‌ పంత్‌..

10 Feb, 2023 20:01 IST|Sakshi

టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ గతేడాది డిసెంబర్‌ 30న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి లక్నోకు వస్తున్న సమయంలో రూర్కీ సమీపంలో కారు యాక్సిడెంట్‌కు గురైంది. కాగా యాక్సిడెంట్‌లో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పలు సర్జరీలు నిర్వహించిన వైద్యులు పంత్‌ కోలుకోవడానికి ఆరు నుంచి తొమ్మిది నెలలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం అతను ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

తాను ఆటలో యాక్టివ్‌గా లేనప్పటికి ఆసుపత్రి నుంచి తరచు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తునే వస్తున్నాడు. బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ ఆడుతున్న టీమిండియాకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. ఇటీవలే పంత్‌ ఆసుపత్రి ఆవరణలోని బాల్కనీ నుంచి తీసి ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ..'' స్వచ్ఛమైన గాలిని పీలుస్తుంటే హాయిగా ఉందంటూ'' క్యాప్షన్‌ జత చేశాడు. దీనికి వేల సంఖ్యలో లైక్స్‌ వచ్చాయి.

తాజాగా పంత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి నడుస్తున్న ఫోటోలను బయటికి వదిలాడు. ఫోటోలో పంత్‌ వాకింగ్‌ స్టిక్‌ సాయంతో ఒక్కో అడుగు వేస్తున్నట్లుగా కనిపించింది. అయితే కుడి కాలికి బ్యాండేజీ కనిపించడం.. కాలు కూడా కొంచెం ఉబ్బినట్లుగా ఉంది. దీనిని బట్టి పంత్‌ కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోను షేర్‌ చేసుకున్న పంత్‌.. ఒక్క అడుగు ముందుకు.. ఒక్క అడుగు బలంగా.. ఒక్క అడుగు బెటర్‌గా అంటూ క్యాప్షన్‌ జత చేయడం ఆసక్తిని కలిగించింది. 

ప్రస్తుతం పంత్‌ బెడ్‌ రెస్ట్‌లో ఉండటంతో ఈ ఏడాది జరిగే కీలక సిరీస్‌లు, టోర్నీలు సహా ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌, ఆతర్వాత జరిగే ఐపీఎల్‌, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, ఆసియా కప్‌లు దూరమయ్యాడు. అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌ వరకు కోలుకున్నా ఫిట్‌నెస్‌ నిరూపించుకొని ఆడడం కష్టమే. ఏది ఏమైనా పంత్‌ త్వరగా కోలుకోవాలని దేవుడిని కోరుకుందాం.

A post shared by Rishabh Pant (@rishabpant)

చదవండి: 'గబ్బా వారియర్‌ మిస్‌ యూ.. నీ లోటు తెలుస్తోంది'

మరిన్ని వార్తలు