Rishabh Pant: కార్‌ యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి స్పందించిన రిషబ్‌ పంత్‌

16 Jan, 2023 19:37 IST|Sakshi

ఇటీవల జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలతో బయట పడి, ప్రస్తుతం ముంబైలోని అంబానీ అసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌.. యాక్సిడెంట్‌ తర్వాత తొలిసారి స్పందించాడు. క్లిష్ట సమయంలో తనకు అండగా నిలిచి, త్వరగా కోలుకోవాలని ప్రార్ధించిన వారందరికీ ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు.

తనకు జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని, కోలుకుని ప్రక్రియ ఇప్పుడిప్పుడే మొదలైందని, మున్ముందు ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని పంత్ అన్నాడు. తనకు అన్ని విధాల అండగా నిలిచిన బీసీసీఐ, జై షా, ప్రభుత్వ యంత్రాగానికి  ధన్యవాదాలు అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

కాగా, పంత్‌.. గతేడాది డిసెంబర్‌ 30న ఢిల్లీ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్‌ ప్రయాణిస్తున్న కారు పూర్తిగా దగ్ధం కావడంతో అతని మోకాలికి, నుదిటిపై, వీపు భాగంలో బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే పంత్‌ను ఢిల్లీలోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బీసీసీఐ అతన్ని ముంబైలోని అంబానీ అసుపత్రికి ఎయిర్‌ లిఫ్ట్‌ చేసింది.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం పంత్‌కు జరిగిన సర్జరీ సక్సెస్‌ అయినప్పటికీ అతను పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాది కాలం పట్టవచ్చని బీసీసీఐ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్యలో అతను స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్‌ సిరీస్‌తో పాటు ఐపీఎల్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023లకు దూరమయ్యే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు