అతడితో నన్ను పోల్చడం అద్భుతం కానీ..: పంత్‌

21 Jan, 2021 15:26 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్రిస్బేన్‌ టెస్టులో ‘హీరో’చిత ఇన్నింగ్స్‌ ఆడి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్న టీమిండియా ఆటగాడు రిషభ్‌ పంత్ ప్రస్తుతం కెరీర్‌లోనే అత్యుత్తమ స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో 691 పాయింట్లతో  13వ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో మరోసారి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ను ధోనితో పోలుస్తూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పంత్‌ మాత్రం తనకంటూ ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటున్నాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా 2018లో సంప్రదాయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పంత్‌.. అనతికాలంలోనే తనదైన ఆటతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఢిల్లీ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లో ఉన్నాడంటే చాలు.. ప్రత్యర్థి ఎవరైనా సరే దూకుడు ప్రదర్శిస్తూ చుక్కలు చూపించేవాడు. ఈ క్రమంలో చాలా మంది క్రికెట్‌ ప్రేమికులు పంత్‌ను, టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో పోల్చేవారు. పంత్‌ కూడా అందుకు తగ్గట్టుగానే రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకునేవాడు.(చదవండి: 'గాబా’ మైదానంలో కొత్త చరిత్ర..)

అయితే.. పంత్‌ మెరుగైన స్ట్రైక్‌ రేట్ కలిగి ఉన్నప్పటికీ నిర్లక్ష్యపు షాట్లతో వికెట్‌ పారేసుకుంటాడనే విమర్శలు మూటగట్టుకున్నాడు. టెస్టు క్రికెట్‌ను పక్కన పెడితే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌ స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ భర్తీ చేయడంతో మెల్లగా అతడికి అవకాశకాలు కూడా సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ధోని వారసుడు అంటూ పంత్‌ను ప్రశంసించిన వాళ్లే అతడి ఆట తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై అతడికి శ్రద్ధ లేదని, పంత్‌ బదులు సంజూ శాంసన్‌ను వికెట్‌ కీపర్‌గా తీసుకోవాలంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేసేవారు. కానీ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌తో మరోసారి తన సత్తా ఏంటో చూపించిన పంత్‌.. విమర్శకుల నోళ్లు మూయించాడు. (చదవండి: స్పైడర్‌మాన్‌ అంటూ రిషభ్‌ పాట.. వైరల్‌)

ఆఖరి టెస్టులో పుజారాతో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడి(89 ప‌రుగులు, నాటౌట్‌) భారత జట్టు చారిత్రక విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఈ నేపథ్యంలో మరోసారి ధోనితో పోలిక తెచ్చి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు పంత్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి ఆకట్టుకున్నాడు. ‘‘ఎంఎస్‌ ధోని వంటి దిగ్గజాలతో పోల్చినపుడు ఎవరికైనా సరే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. నేను కూడా అంతే. ఎవరైనా అలా అన్నపుడు చాలా సంతోషపడతాను. అయితే నన్ను ఎవరితోనూ పోల్చకండి. ఎందుకంటే భారతీయ క్రికెట్‌ చరిత్రలో నాకంటూ ప్రత్యేక స్థానాన్ని, పేరును పొందాలని భావిస్తున్నా. ఆ దిశగా దృష్టి సారించాను కూడా. నిజానికి నాలాంటి యువ ఆటగాడిని దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదు’’ అని పేర్కొన్నాడు. (చదవండి: ఆసీస్‌ టూర్‌: అరంగేట్రంలోనే అదరగొట్టేశారు!)

మరిన్ని వార్తలు