రియాన్‌ పరాగ్‌ ఊచకోత.. 12 ఫోర్లు, 12 సిక్సర్లతో భారీ విధ్వంసం

29 Nov, 2022 12:16 IST|Sakshi

VHT 2022 Quarter Finals: విజయ్‌ హజారే ట్రోఫీ-2022లో భాగంగా నిన్న (నవంబర్‌ 28) జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో వివిధ జట్లకు చెందిన ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన రెండో క్వార్టర్‌ ఫైనల్లో మహారాష్ట్ర కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (159 బంతుల్లో 220; 10 ఫోర్లు, 16 సిక్సర్లు).. ఒకే ఓవర్‌లో 7 సిక్సర్లు బాది అజేయమైన ద్విశతకంతో విధ్వంసం సృష్టించగా, జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మూడో క్వార్టర్‌ ఫైనల్లో అస్సాం ఆటగాడు, రాజస్తాన్‌ రాయల్స్‌ (ఐపీఎల్‌) ప్లేయర్‌ రియాన్‌ పరాగ్‌ 116 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 174 పరుగులు సాధించి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.

రుతురాజ్‌ ఒకే ఓవర్లో 7 సిక్సర్ల రికార్డుతో పలు లిస్ట్‌-ఏ క్రికెట్‌ రికార్డులను బద్దలు కొట్టడంతో రియాన్‌ పరాగ్‌ సునామీ ఇన్నింగ్స్‌ హైలైట్‌ కాలేకపోయింది. పరాగ్‌ సైతం రుతురాజ్‌ తరహాలోనే ప్రత్యర్ధి బౌలర్లను ఓ రేంజ్‌లో ఆటగాడుకున్నాడు. ఫలితంగా అస్సాం.. ప్రత్యర్ధి నిర్ధేశించిన 351 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 23 బంతులుండగానే ఛేదించి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన జమ్మూ కశ్మీర్‌..శుభమ్‌ కజూరియా (120), హెనన్‌ నజీర్‌ (124) శతకాలతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో రియాన్‌ పరాగ్‌, రిషవ్‌ దాస్‌ (114 నాటౌట్‌) శతకాలతో విజృంభించడంతో అస్సాం ఆడుతూపాడుతూ లక్ష్యాన్ని చేరుకుని సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. కాగా, రేపు (నవంబర్‌ 30) జరుగబోయే సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో కర్ణాటక-సౌరాష్ట్ర, మహారాష్ట్ర-అస్సాం జట్లు తలపడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లో విజేతలు డిసెంబర్‌ 2న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకుంటాయి.    
 

మరిన్ని వార్తలు