Road Safety World Series 2022: ఇండియా, వెస్టిండీస్‌ మ్యాచ్‌ రద్దు

14 Sep, 2022 21:43 IST|Sakshi

రోడ్‌ సేఫ్టీ వరల్డ్ సిరీస్ రెండో ఎడిషన్‌ (2022)లో భాగంగా ఇండియా లెజెండ్స్, వెస్టిండీస్ లెజెండ్స్ మధ్య జట్ల మధ్య కాన్పూర్‌ వేదికగా ఇవాళ (సెప్టెంబర్‌ 14) జరగాల్సిన క్రికెట్‌ మ్యాచ్‌ రద్దైంది. భారీ వర్షం కారణంగా మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దైనట్లు అంపైర్లు ప్రకటించారు. ఫలితంగా ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది.

తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన భారత్‌.. తాజాగా లభించిన ఒక్క పాయింట్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందిన శ్రీలంక (4 పాయింట్లు) టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుండగా.. వెస్టిండీస్‌ (3), సౌతాఫ్రికా (2), ఇంగ్లండ్‌ (0), బంగ్లాదేశ్‌ (0), ఆస్ట్రేలియా (0), న్యూజిలాండ్‌ (0) జట్లు వరుసగా మూడు నుంచి ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. 

ఇదిలా ఉంటే, టోర్నీలో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ నేతృత్వంలోని డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌.. సౌతాఫ్రికాను 61 పరుగుల భారీ తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ (42 బంతుల్లో 82 నాటౌట్‌; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా లెజెండ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. టోర్నీలో భాగంగా రేపు (సెప్టెంబర్‌ 15) జరుగబోయే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌ జట్టు.. న్యూజిలాండ్‌ లెజెండ్స్‌ను ఢీకొట్టనుంది. 

మరిన్ని వార్తలు