Road Safety World Series 2022: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్‌ 

17 Sep, 2022 20:23 IST|Sakshi

ఇండోర్‌ వేదికగా బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ లెజెండ్స్‌ సూపర్‌ విక్టరీ సాధించింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా దిగ్గజాలు 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేశారు. వికెట్‌కీపర్‌ దిమాన్‌ ఘోష్‌ (32 బంతుల్లో 41 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌),  అలోక్‌ కపాలీ (21 బంతుల్లో 37 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఓ మోస్తరుగా రాణించగా.. ఓపెనర్లు నజీముద్దీన్‌ (0), మెహ్రబ్‌ హొసేన్‌ (1) దారుణంగా విఫలమయ్యారు. కివీస్‌ బౌలర్లలో కైల్‌ మిల్స్‌ 2 వికెట్లు పడగొట్టగా.. బెన్నెట్‌కు ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. 

అనతంరం 99 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్‌ దిగ్గజ టీమ్‌.. 9.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ జేమీ హౌ (17 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. డీన్‌ బ్రౌన్లీ (19 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, సిక్స్‌), కెప్టెన్‌ రాస్‌​ టేలర్‌ (17 బంతుల్లో 30 నాటౌట్‌; 3 సిక్సర్లు) అజేయ ఇన్నింగ్స్‌లతో జట్టును విజయతీరాలకు చేర్చారు. బంగ్లా బౌలర్లలో అబ్దుర్‌ రజాక్‌, అలోక్‌ కపాలీకి తలో వికెట్‌ దక్కింది.  

ఈ గెలుపుతో న్యూజిలాండ్‌ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి (2 మ్యాచ్‌ల్లో ఓ విజయం) ఎగబాకగా.. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన బంగ్లాదేశ్‌ ఏడో స్థానంలో నిలిచింది. రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక టేబుల్‌ టాపర్‌గా కొనసాగుతుండగా.. ఇండియా లెజెండ్స్‌, విండీస్‌ లెజెండ్స్‌, సౌతాఫ్రికా లెజెండ్స్‌, న్యూజిలాండ్‌ లెజెండ్స్‌, ఇంగ్లండ్‌ లెజెండ్స్‌, బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌, ఆస్ట్రేలియా లెజెండ్స్‌ వరుసగా రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఈ టోర్నీలో ఇవాళ ఇదే వేదికగా మరో మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్‌లో విండీస్‌ లెజెండ్స్‌ను ఇంగ్లండ్‌ దిగ్గజ టీమ్‌ ఢీకొట్టాల్సి ఉంది. 


 

మరిన్ని వార్తలు