Robin Uthappa Retirement: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌

14 Sep, 2022 20:00 IST|Sakshi

టీమిండియా డాషింగ్‌ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించాడు. టీమిండియాకు, సొంత రాష్ట్రం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని ఉతప్ప ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్రతి విషయానికి ఏదో ఒక సమయంలో ముగింపు ఉంటుంది. కాబట్టి, నేను కూడా భారత క్రికెట్‌తో ఉన్న అనుబంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నానని ట్వీటాడు.

తన 20 ఏళ్ల కెరీర్‌లో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే రాబీ తాను ప్రాతినిధ్యం వహించిన ఐపీఎల్‌ టీమ్‌లకు (సీఎస్‌కే, కేకేఆర్‌, ముంబై ఇండియ‌న్స్‌, ఆర్సీబీ, పూణే వారియ‌ర్స్) సైతం కృతజ్ఞతలు తెలిపాడు. రాబీ తన ఐపీఎల్‌ కెరీర్‌లో రెండుసార్లు విజేతగా (సీఎస్‌కే, కేకేఆర్‌) నిలిచిన జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. 

36 ఏళ్ల ఉతప్ప.. 2006-15 మధ్యలో 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6 హాఫ్‌ సెంచరీ సాయంతో 934 పరుగులు, టీ20ల్లో ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 249 పరుగులు సాధించాడు. ఉతప్ప తన ఐపీఎల్‌ కెరీర్‌లో 205 మ్యాచ్‌ల్లో 27 హాఫ్‌ సెంచరీల సాయంతో 130.3 స్ట్రయిక్‌ రేట్‌తో 4952 పరుగులు చేశాడు. దూకుడైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన ఉతప్ప.. చాలా సందర్భాల్లో వికెట్‌కీపర్‌గానూ సేవలందించాడు. ఉతప్ప ప్రస్తుతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 


 

మరిన్ని వార్తలు