హెడెన్‌ నాతో 2-3 ఏళ్లు మాట్లాడలేదు.. బాధేసింది.. కానీ

17 May, 2021 14:19 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆటలో గెలుపోటములు సహజం. క్రీడా స్పూర్తితో ముందుకు సాగితే మైదానం వెలుపల ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతోనైనా ఇట్టే కలిసిపోవచ్చు. ముఖ్యంగా సీనియర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటే అవి కెరీర్‌పరంగా కూడా ఉపయోగపడతాయి. కానీ, చిన్న చిన్న పొరపొచ్చాల వల్ల మనకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తికి దూరంగా ఉండాల్సి వస్తే బాధ పడటం సహజం. టీమిండియా వెటరన్‌ ప్లేయర్‌ రాబిన్‌ ఊతప్పకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. టీ20 వరల్డ్‌ కప్‌- 2007 నాటి మ్యాచ్‌లో భాగంగా చోటుచేసుకున్న స్లెడ్జింగ్‌ కారణంగా మ్యాథ్యూ హెడెన్‌తో చాలాకాలం పాటు అతడితో మాట్లాడలేకపోయానని ఊతప్ప తాజాగా వెల్లడించాడు.

సౌరభ్‌ పంత్‌ యూట్యూబ్‌ షో.. ‘వేకప్‌ విత్‌ సౌరభ్‌’లో ఊతప్ప మాట్లాడుతూ.. ‘‘ ఆ మ్యాచ్‌లో గౌతీ(గౌతం గంభీర్‌), నేను.. ఆండ్రూ సైమండ్స్‌, మిచెల్‌ జాన్సన్‌, బ్రాడ్‌ హాడిన్‌ స్లెడ్జింగ్‌ను తిప్పికొట్టాం. అయితే, ఒక వ్యక్తిగా, బ్యాట్స్‌మెన్‌గా నాకెంతో స్ఫూర్తిగా నిలిచిన మాథ్యూ హెడెన్‌తో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురుకావడం కాస్త కష్టంగా తోచింది. తను బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో నన్ను ఉద్దేశించి ఏదో అన్నాడు. నేను కూడా తనకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్నాను. అలా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే, అది అక్కడితో ముగిసిపోలేదు. 

ఈ ఘటన జరిగిన తర్వాత రెండు, మూడేళ్ల పాటు అతడు నాతో మాట్లాడలేదు. నాకు దూరంగా ఉండేవాడు. అది నన్ను చాలా బాధించింది. ఆ మ్యాచ్‌లో మేం గెలిచాం. కానీ, నా రోల్‌మోడల్‌తో మాట్లాడే అవకాశం కోల్పోయాను’’ అని చెప్పుకొచ్చాడు. అయితే, తన కెరీర్‌లోనే అత్యంత గొప్పదైన మ్యాచ్‌ అదేనని, ఆటను పూర్తిగా ఆస్వాదిస్తూనే ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించామని గుర్తుచేసుకున్నాడు. కాగా దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌లో ధోని సేన ఆస్ట్రేలియాను ఓడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఊతప్ప వరుసగా 934, 249 పరుగులు చేశాడు.  

చదవండి: 10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు