Virat Kohli - Robin Uthappa: జట్టులో కోహ్లి స్థానం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు! వీళ్లంతా అప్పుడేం చేశారు?

26 Jul, 2022 15:48 IST|Sakshi
విరాట్‌ కోహ్లి(ఫైల్‌ ఫొటో)

Robin Uthappa Comments In Virat Kohli Form: ‘‘విరాట్‌ కోహ్లి పరుగులు సాధించినపుడు.. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సెంచరీలు బాదినపుడు.. ఇలా ఆడాలి. అలా ఆడాలి అని ఎవరూ చెప్పలేదు కదా! మరి ఇప్పుడు ఎందుకు జట్టులో అతడి స్థానం గురించి ప్రశ్నిస్తున్నారు. అసలు మనలో ఎవరికీ కోహ్లిని క్వశ్చన్‌ చేసే హక్కు లేనేలేదు’’ అని టీమిండియా, చెన్నై సూపర్‌కింగ్స్‌ వెటరన్‌ బ్యాటర్‌ రాబిన్‌ ఊతప్ప అన్నాడు.

ఈ మేరకు తనదైన శైలిలో కోహ్లి విమర్శకులకు కౌంటర్‌ ఇచ్చాడు. కాగా గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమవుతున్న భారత జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు కపిల్‌దేవ్‌ వంటి లెజెండ్స్‌ అతడిని పక్కనపెట్టాలని సూచిస్తుండగా.. సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలు సహా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విదేశీ సారథులు కూడా కోహ్లికి మద్దతుగా నిలుస్తున్నారు.


రాబిన్‌ ఊతప్ప(PC: CSK)

70 సెంచరీలు చేశాడు కదా!
ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా స్పందించిన ఊతప్ప షేర్‌చాట్‌ ఆడియో చాట్‌రూమ్‌ సెషన్‌లో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘కోహ్లి ఇప్పటికే 70 సెంచరీలు సాధించాడు. ఇంతటి గొప్ప ప్రతిభ కలిగి ఉండి భారత క్రికెట్‌ పేరును నిలబెట్టిన అతడికి ధన్యవాదాలు చెప్పాలి. ఇప్పుడు కూడా అతడు 30 లేదంటే 35 పరుగులు చేయగలుగుతున్నాడు.

కొన్నిరోజులు కోహ్లిని ఒంటరిగా వదిలేయండి. తనదైన శైలిలో క్రికెట్‌ ఆడే వరకు వేచి చూడండి. తనకు ఏది మంచో మనకంటే తనకే బాగా తెలుసు. తన సమస్య ఏమిటో కూడా తనకే తెలుసు. అంతేకాదు దానిని అధిగమించగల సత్తా కూడా అతడికి ఉంది. అంతవరకు అతడి మానాన అతడిని వదిలేసి కాస్త ఓపికగా ఎదురు చూడటం కంటే మనం చేసేదేమీ లేదు’’ అని ఊతప్ప కోహ్లికి మద్దతుగా నిలిచాడు.

అతడు మ్యాచ్‌ విన్నర్‌.. ఎవరికీ ఆ హక్కులేదు!
అదే విధంగా టీమిండియా వరుస సిరీస్‌ల నేపథ్యంలో విశ్రాంతి పేరిట కోహ్లి జట్టుకు దూరం కావడంపై స్పందిస్తూ.. ‘‘ఒకవేళ తనకు బ్రేక్‌ కావాలని కోరుకుంటే కోహ్లి తప్పక విశ్రాంతి తీసుకుంటాడు. ఒకవేళ అతడికి ఫలానా సిరీస్‌ లేదంటే ఫలానా టోర్నీ ఆడాలని ఉందంటే తప్పకుండా ఆడతాడు. అందుకు యాజమాన్యం అంగీకరించాలి. అంతేగానీ.. జట్టులో అతడి స్థానం ఏమిటన్న విషయంపై బయట పెద్దగా చర్చ అవసరం లేదు.

అతడు మ్యాచ్‌ విన్నర్‌. ప్రపంచంలోని బెస్ట్‌ మ్యాచ్‌ విన్నర్‌ అని ఇప్పటికే రుజువు చేసుకున్నాడు. అలాంటి వ్యక్తి శక్తిసామర్థ్యాల గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు’’ అని ఊతప్ప ఉద్వేగ పూరితంగా మాట్లాడాడు. కాగా వెస్టిండీస్‌ పర్యటనకు దూరమైన కోహ్లి.. ఆసియా కప్‌ టోర్నీ నేపథ్యంలో ఆగష్టులో తిరిగి జట్టుతో చేరే అవకాశం ఉంది. 
చదవండి: Axar Patel: ఆఖరి ఓవర్లో సిక్సర్‌ బాది టీమిండియాను గెలిపించింది వీళ్లే! ఎప్పుడెప్పుడంటే?
Rohit Sharma Latest Photo: వెస్టిండీస్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్‌.. పంత్‌, డీకేతో పాటు

మరిన్ని వార్తలు