French Open 2021: ఫెడరర్‌ ముందంజ

4 Jun, 2021 03:40 IST|Sakshi

మూడో రౌండ్‌కు స్విస్‌ స్టార్‌ 

గాయంతో వైదొలిగిన బార్టీ

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌

పారిస్‌: స్విస్‌ దిగ్గజం, 20 గ్రాండ్‌స్లామ్‌ల విజేత రోజర్‌ ఫెడరర్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మరో స్ఫూర్తిదాయక ప్రదర్శనతో సత్తా చాటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ పోరులో ఎనిమిదో సీడ్‌ ఫెడరర్‌ 6–2, 2–6, 7–6 (7/4), 6–2తో మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా)పై గెలుపొంది మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. 2 గంటలా 35 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌ను ఫెడరర్‌ ఘనంగా ఆరంభించాడు. పదునైన ఏస్‌లతో పాటు... బ్యాక్‌ హ్యాండ్‌ షాట్లతో ప్రత్యర్థిపై విరుచుకుపడి తొలి సెట్‌ను అలవోకగా నెగ్గాడు. అయితే రెండో సెట్‌లో పుంజుకున్న సిలిచ్‌ ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు.

ఇక మూడో సెట్‌ ‘టై బ్రేక్‌’కు దారితీయగా... అక్కడ ఎటువంటి ఒత్తిడికి గురికాని ఫెడరర్‌ ‘టై బ్రేక్‌’ ద్వారా మూడో సెట్‌ను కైవసం చేసుకున్నాడు. నాలుగో సెట్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడిన ఫెడరర్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్‌ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ 16 ఏస్‌లు సంధించి... ఒకే ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. సిలిచ్‌ 12 ఏస్‌లు కొట్టినా కీలక సమయాల్లో ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.

జొకోవిచ్, స్వియాటెక్‌ కూడా...
రెండో రౌండ్‌ పోరులో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా ఆటగాడు జొకోవిచ్‌ 6–3, 6–2, 6–4తో పబ్లో క్వెవాజ్‌ (ఉరుగ్వే)పై గెలిచి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. రెండు గంటలా ఆరు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఎక్కడా తడబాటుకు గురికాకుండా మ్యాచ్‌ను ముగించేశాడు. రెండో సీడ్‌ డానిల్‌ మెద్వెదేవ్‌ (రష్యా) 3–6, 6–1, 6–4, 6–3తో టామీ పాల్‌ (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ అలవోకగా మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. ఎనిమిదో సీడ్‌ స్వియాటెక్‌ 6–1, 6–1తో 61 నిమిషాల్లో రెబెకా పీటర్సన్‌ (స్వీడన్‌)ను అలవోకగా ఓడించింది.    

బార్టీని వెంటాడిన గాయం...
ఫ్రెంచ్‌ ఓపెన్‌ నుంచి మహిళల సింగిల్స్‌ టాప్‌ సీడ్, ఆస్ట్రేలియా భామ యాష్లే బార్టీ తుంటి గాయంతో తప్పుకుంది. మగ్దా లినెట్టే (పొలాండ్‌)తో జరిగిన రెండో రౌండ్‌ పోరు మధ్యలోనే 2019 ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ బార్టీ గాయంతో వైదొలిగింది. మ్యాచ్‌లో బార్టీ 1–6, 2–2తో వెనుకబడి ఉన్న సమయంలో ఇక ఆడటం తన వల్ల కాదంటూ ప్రత్యర్థికి వాకోవర్‌ ఇచ్చింది. మ్యాచ్‌ ఆడుతున్నంత సేపూ ఇబ్బంది పడ్డ బార్టీ తొలి సెట్‌ను 1–6తో కోల్పోయింది.

అనంతరం ఆమె మెడికల్‌ టైమౌట్‌ను కూడా తీసుకుంది. ఆ తర్వాత కూడా కోర్టులో సౌకర్యంగా కదల్లేకపోయిన బార్టీ మ్యాచ్‌ నుంచి తప్పుకుంది. మరోవైపు తొమ్మిదో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 5–7, 1–6తో అన్‌సీడెడ్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) చేతిలో ఓడింది. ఐదో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–0, 6–4తో అన్‌ లీ (అమెరికా)పై, నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా) 7–5, 6–3తో హెలీ (అమెరికా)పై, అమెరికా టీనేజ్‌ సంచలనం కోకో గౌఫ్‌ 6–3, 7–6 (7/1)తో వాంగ్‌ క్వియాంగ్‌ (చైనా)పై నెగ్గి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.  

ప్రిక్వార్టర్స్‌లో బోపన్న జోడీ...
పురుషుల డబుల్స్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)– ఫ్రాంకో స్కుగోర్‌ (క్రొయేషియా) ద్వయం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో బోపన్న–స్కుగోర్‌ జంట 6–4, 7–5తో ఫ్రాన్సెస్‌ టియాఫో– నికోలస్‌ మొన్రో (అమెరికా) జంటపై గెలిచింది. మరో వైపు పురుషుల డబుల్స్‌ విభాగంలో బరిలోకి దిగాల్సిన ఒక జంటకు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వారి పేర్లను మాత్రం నిర్వాహకులు బయటపెట్టలేదు. పాజిటివ్‌గా తేలిన జోడీ టోర్నీ నుంచి వైదొలిగిందని... వారి స్థానంలో వేరే జంటను బరిలోకి దింపినట్లు వెల్లడించారు.  

నేను ఆలస్యం చేస్తున్నానా..!
ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ సహనాన్ని కోల్పోయాడు. రెండో సెట్‌ ఐదో గేమ్‌లో సిలిచ్‌ సర్వీస్‌ చేస్తుండగా... సర్వీస్‌ను రిసీవ్‌ చేసుకునే స్థానానికి ఫెడరర్‌ ఆలస్యంగా చేరుకుంటూ సమయాన్ని వృథా చేస్తున్నాడంటూ చైర్‌ అంపైర్‌ అతనికి ‘సమయ ఉల్లంఘన’ హెచ్చరికను జారీ చేశాడు. దీనిపై ఆగ్రహించిన ఫెడరర్‌ అంపైర్‌తో కొన్ని నిమిషాలపాటు వాగ్వివాదానికి దిగాడు. సిలిచ్‌ను చూస్తూ ‘నేను మరీ అంత నెమ్మదిగా ఉన్నానా...’ అంటూ ఫెడరర్‌ ప్రశ్నించగా... ‘అవునూ... నేను సర్వీస్‌కు సిద్ధంగా ఉన్నా... నువ్వు మాత్రం టవల్‌తో కాలక్షేపం చేస్తూ కనిపిస్తున్నావ్‌’ అంటూ సిలిచ్‌ బదులిచ్చాడు.

మరిన్ని వార్తలు