టెర్రస్‌పై టెన్నిస్‌... చిన్నారులతో పాస్తా

2 Aug, 2020 03:05 IST|Sakshi

స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ఆత్మీయ చర్య

రోమ్‌: ఆటతో టెన్నిస్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించాలన్నా... అందమైన మనసుతో అభిమానుల్ని ఆకట్టుకోవాలన్నా స్విట్జర్లాండ్‌ యోధుడు రోజర్‌ ఫెడరర్‌ తర్వాతే ఇంకెవరైనా... ఇప్పటికే చాలా సందర్భాల్లో తన మాటలతో, చర్యలతో అందరి మది దోచుకున్నాడు. తాజాగా 38 ఏళ్ల ఈ దిగ్గజ ప్లేయర్‌ ఇటలీకి చెందిన ఇద్దరు చిన్నారుల్ని ఆనందాశ్చర్యాలకు గురి చేశాడు. వారితో టెన్నిస్‌ ఆడటంతోపాటు కమ్మగా పాస్తాను ఆరగించి వారికి మరపురాని సంతోషాన్ని పంచాడు. లాక్‌డౌన్‌ కాలంలోనూ ఇంటి టెర్రస్‌పై టెన్నిస్‌ ఆడుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన చిన్నారులు విటోరియా (13 ఏళ్లు), కరోలా (11 ఏళ్లు)లకు ఫెడరర్‌ స్వీట్‌ షాకిచ్చాడు. ఎదురెదురు ఇళ్ల టెర్రస్‌లపై నిలబడి అత్యంత కచ్చితత్వంతో ర్యాలీలు ఆడిన ఈ చిన్నారుల వీడియో ఏప్రిల్‌లో వైరల్‌గా మారింది.

వీరి అంకితభావానికి ముగ్ధుడైన రోజర్‌ జూలై 10న వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. తమ ఆరాధ్య ప్లేయర్‌ను చూసిన ఈ చిన్నారులిద్దరూ ఆనందంతో గంతులేస్తూ తమకు కనిపించిన వారందరికీ ఈ విషయాన్ని చాటి చెప్పారు. వారిలాగే ఎదురెదురు ఇళ్లపై నిలబడి వారితో టెన్నిస్‌ ఆడిన ఫెడరర్‌... ఇప్పటివరకు ఎన్నో ప్రతిష్టాత్మక వేదికలపై ఆడినప్పటికీ, ఇలాంటి అనుభూతి ఎప్పుడూ కలగలేదని పేర్కొన్నాడు. అనంతరం వారితో పాస్తాను ఆస్వాదించడంతో పాటు సెల్ఫీలకు ఫోజులివ్వడంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అంతేకాకుండా వారిద్దరిని రాఫెల్‌ నాదల్‌ అకాడమీలో వేసవి శిబిరానికి పంపిస్తున్నట్లు ఫెడరర్‌ చెప్పాడు. 

మరిన్ని వార్తలు