Roger Federer Retirement: ఫెదరర్‌ ఆస్తి విలువ ఎంతో తెలుసా?

16 Sep, 2022 13:48 IST|Sakshi

స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌ గురువారం అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఓపెన్‌ శకంలో ఆల్‌టైమ్‌ గ్రేట్స్‌లో ఒకడిగా పేరు పొందిన ఫెదరర్‌ టెన్నిస్‌లో లెక్కలేనన్ని విజయాలు సాధించాడు.  20 గ్రాండ్‌స్లామ్స్‌ టైటిల్స్‌ అందరికంటే ముందుగా సాధించింది రోజర్‌ ఫెదరర్‌రే. తన ఆటతో టెన్నిస్‌కు అందం తెచ్చిన ఫెదరర్‌.. సంపాదన విషయంలోనూ చాలా ముందుంటాడు. ప్రస్తుత తరంలో టెన్నిస్‌ దిగ్గజాలుగా పిలవబడుతున్న నాదల్‌, జొకోవిచ్‌లు వచ్చిన తర్వాత ఫెదరర్‌ హవా కాస్త తగ్గినప్పటికి.. సంపాదనలో మాత్రం ఫెదరర్‌ వెనకే ఉండడం విశేషం. 

41 ఏళ్ల ఫెదరర్‌ తన కెరీర్‌లో ప్రైజ్‌మనీగా 13.1 కోట్ల డాలర్లు(సుమారు రూ.1042 కోట్లు) సంపాదించాడు. అయితే కోర్టు లోపల కంటే వెలేపలే అతని సంపాదన ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఎండార్స్‌మెంట్లు, ఇతర బిజినెస్‌లతో కలిపి ఫెదరర్‌ ఇప్పటి వరకూ 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8 వేల కోట్లు)కుపైగా సంపాదించినట్లు ఫోర్బ్స్‌ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రతి ఏటా టెన్నిస్‌ కోర్టు బయట ఫెదరర్‌ సంపాదన 9 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఈ రిపోర్ట్‌ తెలిపింది.

ఫెదరర్‌ తన కెరీర్‌లో ఏకంగా 17 ఏళ్ల పాటు అత్యధిక మొత్తం అందుకున్న టెన్నిస్‌ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. పన్నులు, ఏజెంట్ల ఫీజులు కలిపితే తన కెరీర్‌లో ఫెదరర్‌ మొత్తం సంపాదన 110 కోట్ల డాలర్లు. ఇది టెన్నిస్‌ కోర్టులో అతని ప్రధాన ప్రత్యర్థులైన నదాల్‌ (50 కోట్ల డాలర్లు), జోకొవిచ్ (47 కోట్ల డాలర్లు)ల కంటే రెట్టింపు కావడం విశేషం.


స్విట్జర్లాండ్‌లోని రోజర్‌ ఫెదరర్‌కు చెందిన గ్లాస్‌ హౌస్‌

ప్రపంచంలో 100 కోట్ల డాలర్ల మైల్‌స్టోన్‌ అందుకున్న ఏడో క్రీడాకారుడు రోజర్‌ ఫెదరర్‌. జాబితాలో ఫెదరర్‌ కంటే (ముందు..ఆ తర్వాత) లెబ్రన్‌ జేమ్స్‌, ఫ్లాయిడ్‌ మేవెదర్‌, లియోనెల్‌ మెస్సీ, ఫిల్‌ మికెల్‌సన్‌, క్రిస్టియానో రొనాల్డో, టైగర్‌ వుడ్స్‌లు తమ కెరీర్‌లలో 100 కోట్ల డాలర్ల సంపాదన మార్క్‌ను అందుకున్నారు. ఇక 24 ఏళ్ల టెన్నిస్‌ కెరీర్‌లో రోజర్‌ ఫెదరర్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌, మొత్తంగా 103 సింగిల్స్‌ టైటిల్స్‌(ఓపెన్‌ శకంలో రెండో ఆటగాడు) సాధించాడు. 


ఖరీదైన రోలెక్స్‌ వాచ్‌తో ఫెదరర్‌

చదవండి: రోజర్‌ ఫెడరర్‌ వీడ్కోలు..

'రిటైర్మెంట్‌ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ'

'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా'

మరిన్ని వార్తలు