Roger Federer: 'చివరి మ్యాచ్‌ మాత్రమే.. అంతిమయాత్రలా చేయకండి'

22 Sep, 2022 08:40 IST|Sakshi

స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌కు లావెర్‌ కప్‌ చివరి టోర్నీ కానున్న సంగతి తెలిసిందే. ఇటీవలే యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో నాలుగో రౌండ్‌లో వెనుదిరిగిన అనంతరం ఫెదరర్‌ తన 24 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక లావెర్‌ కప్‌ ఫెదరర్‌కు చివరి టోర్నీ కానుంది. ఈ టోర్నీ అనంతరం టెన్నిస్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలకనున్నాడు.

ఫెదరర్‌కు చివరి టోర్నీ కావడంతో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని లావెర్‌ కప్‌ టోర్నీ నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ శుక్రవారం ఫెదరర్‌ లావెర్‌కప్‌లో డబుల్స్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. 24 కెరీర్‌లో మొత్తం 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఫెదరర్‌ లావెర్‌ కప్‌ టోర్నీ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడాడు. ''ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో నాకిది చివరి మ్యాచ్‌.. అంతే. దీంతో నా జీవితం ముగిసిపోలేదు. అనవసరంగా నన్ను హీరోని చేస్తున్నారు. చివరి మ్యాచ్‌ చూసేందుకు సంతోషంగా రండి.. దయచేసి అంతిమయాత్రలా చేయకండి ప్లీజ్‌'' అంటూ పేర్కొన్నాడు.

ఇక రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఆట కొనసాగిస్తానని ఫెదరర్‌ పేర్కొన్నాడు. కుటుంబంతో గడపడానికి, కొత్త ప్రదేశాల సందర్శనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానన్నాడు. లండన్‌లో చివరి మ్యాచ్‌ ఆడడానికి ఒక కారణం ఉందని ఫెదరర్‌ పేర్కొన్నాడు. ఇక్కడి అభిమానులు నాకెంతో ఇచ్చారు.. అందుకే వారి సమక్షంలో నా ఆటను ముగించాలనుకుంటున్నానంటూ వెల్లడించాడు.

కాగా ఫెదరర్‌ ఆడనున్న చివరి మ్యాచ్‌కు పలువురు టెన్నిస్‌ ప్రముఖులు రానున్నారు. ఫెదరర్‌ చిరకాల మిత్రుడు రఫేల్‌ నాదల్‌ కూడా హాజరు కానున్నాడు. ఈ విషయాన్ని నాదల్‌ స్వయంగా ట్విటర్‌ వేదికగా తెలిపాడు. ఫెడ్డీ మ్యాచ్‌కు రానున్న జొకోవిచ్‌ ఉద్దేశించి '' జొకో.. నేను రేపు లండన్‌కు వస్తున్నా.. ఫెడ్డీ మ్యాచ్‌ చూడడానికి.. వెయిట్‌ ఫర్‌ మీ'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు.

చదవండి: కోహ్లి, ధావన్‌ల తర్వాత స్మృతి మందానకే సాధ్యమైంది..

మరిన్ని వార్తలు