ఇండో-పాక్‌ జోడీ మళ్లీ జతకట్టనుంది..

3 Mar, 2021 19:00 IST|Sakshi

న్యూఢిల్లీ: టెన్నిస్‌లో ఇండో-పాక్‌ ఎక్స్‌ప్రెస్‌గా ఖ్యాతి గడించిన భారత టెన్నిస్‌ ఆటగాడు రోహన్‌ బోపన్న, పాకిస్థాన్‌ క్రీడాకారుడు ఐసమ్‌ ఉల్‌ హక్‌ ఖురేషీల జోడీ మళ్లీ జతకట్టనుంది.  వీరిద్దరి జోడీ ఏడేళ్ల తరువాత మెక్సికన్‌ ఓపెన్‌ టోర్నీ బరిలో దిగనుంది.  వీరి‍ద్దరి జోడీ చివరిసారిగా 2014 షెన్‌జన్‌ టోర్నీలో పాల్గొంది. ఆ టోర్నీలో వీరు క్వార్టర్స్‌లో నిష్క్రమించారు. ఆతరువాత వివిధ కారణాల వల్ల వీరు విడిపోయారు. వీరి జోడీ గతంలో ఐదు టైటిళ్లను సాధించి విజయంతమైన జోడీగా కొనసాగింది. 

2010 వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన వీరు, అదే ఏడాది జరిగిన యూఎస్‌ ఓపెన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచారు. వీరి జోడీ 2011 పారిస్‌ మాస్టర్స్‌ టోర్నీ నెగ్గడంతో ఏటీపీ దబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో తొలిసారిగా టాప్‌-10లోకి చేరుకున్నారు. డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం బోపన్న 40వ స్థానంలో, ఖురేషీ 49వ ర్యాంకులో కొనసాగుతున్నారు.  కాగా, అకాపుల్కో వేదికగా జరుగనున్న ఈ ఏటీపీ 500 టోర్నీ ఈనెల 15న ప్రారంభంకానుంది.

మరిన్ని వార్తలు