నీదే పిల్లాడి మనస్తత్వం అందుకే, ఇలా..

20 Dec, 2020 12:30 IST|Sakshi

అభిమానికి గట్టి కౌంటర్‌ ఇచ్చిన గావస్కర్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. పింక్‌బాల్‌ టెస్టులో అవమానకర రీతిలో కోహ్లి సేన ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులే చేసిన భారత్‌ తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. దీంతో టీమిండియా ప్రదర్శనపై ఇంటా బయటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతి విశ్వాసమే ఈ పరిస్థితిని కల్పించింది అని కొందరు అంటుంటే, మరికొందరేమో పింక్‌ బాల్‌ కొంపముంచిందని భారత ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ తనయుడు, మాజీ ఆటగాడు రోహన్‌ గావస్కర్‌ కోహ్లి సేనపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. తొలి ఇన్నింగ్స్‌ టెస్టు మ్యాచ్‌గా, రెండో ఇన్నింగ్స్‌ టీ20 గా అనిపించిందని ట్విటర్‌లో కామెంట్‌ చేశాడు. పింక్‌ బాల్‌ టెస్టుతో మరో కొత్త ఫార్మాట్‌ పుట్టుకొచ్చిందని పేర్కొన్నాడు. అయితే, రోహన్‌ కామెంట్లపై ఓ అభిమాని విరుచుకుపడ్డాడు. 

‘హే బడ్డీ.. ఇంతకూ క్రికెట్‌కు సంబంధించి ఏం సాధించావ్‌. టీమిండియా ఆటగాళ్లపై ఊరికే ఎందుకు కామెంట్‌ చేస్తావ్‌. ముందు నీ జీవితంలో ఏదైనా సాధించు. నీకింకా చిన్నా పిల్లాడి మనస్తత్వమే ఉంది’అని ఎద్దేవా చేశాడు. ఇక అభిమాని కౌంటర్‌పై రోహన్‌ తనదైన శైలిలో స్పందించాడు. ‘నన్ను బడ్డీ అని కామెంట్‌ చేస్తున్న నీదే పిల్లల మనస్తత్వం. భారత్‌ తరపున వన్డేలకు ప్రాతినిథ్యం వహించాను. కనుకనే టీమిండియాపై కామెంట్లు చేస్తున్నాను. నువ్‌ ఫాంటసీ క్రికెట్‌ ఆడుకో. ఒకరిపై ఆధారపడకుండా బతకడం నేర్చుకో’ అని చురకలు వేశాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లోకి 2004లో అరంగేట్రం చేసిన రోహన్‌ 11 వన్డేలు ఆడి 18.87 సగటుతో 151 పరుగులు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 117 మ్యాచ్‌లు ఆడి 44 సగటుతో 6900 పరుగులు చేశాడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

>
మరిన్ని వార్తలు