IND vs PAK Asia Cup 2022: పాక్‌తో మ్యాచ్‌.. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు రోహిత్‌ డుమ్మా; కేఎల్‌ రాహుల్‌ ఏమన్నాడంటే..

27 Aug, 2022 08:46 IST|Sakshi
Photo Credit: BCCI Twitter

ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌కు మరో 24 గంటలు మాత్రమే మిగిలిఉంది. మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకు తగ్గట్లే తమ ప్రాక్టీస్‌లో స్పీడును పెంచాయి. అయితే పాకిస్తాన్‌ జట్టను మాత్రం గాయాలు కలవరపెడుతున్నాయి. మోకాలి నొప్పితో షాహిన్‌ అఫ్రిది దూరం కాగా.. తాజాగా వెన్నునొప్పితో మహ్మద్‌ వసీమ్‌ ఆసియాకప్‌ మొత్తానికే దూరమయ్యాడు. అతని స్థానంలో హసన్‌ అలీని తుదిజట్టులోకి ఎంపిక చేసినట్లు పీసీబీ ట్విటర్‌లో ప్రకటించింది.

ఇక మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్లు ప్రెస్‌మీట్‌కు రావడం ఆనవాయితీ. అయితే ఈ ప్రెస్‌మీట్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ డుమ్మా కొట్టాడు. హిట్‌మ్యాన్‌ స్థానంలో వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ హాజరయ్యాడు. కేఎల్‌ రాహుల్‌ మాట్లాడుతూ..'' మ్యాచ్‌ ఓటమి అనేది బాధించడం సహజం. గత టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే మేం ఓడిపోయాం. అప్పటి ఓటమికి బదులు తీర్చుకునేందుకు మాకు మరో అవకాశం వచ్చింది.

ఇక చిరకాల ప్రత్యర్థి పాక్‌తో మేజర్‌ టోర్నీల్లో తప్ప ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడడం లేదు. అందుకే ఎప్పుడు పాక్‌తో మ్యాచ్‌ జరిగినా అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. కానీ ఇవన్నీ క్రీడలో భాగంగానే. ఏ ఆటైనా జీరో నుంచే మొదలవుతుంది. ఇక పాక్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఒక వరల్డ్‌క్లాస్‌ బౌలింగ్‌ను మేము ఈ మ్యాచ్‌లో మిస్సవుతున్నాం'' అంటూ ముగించాడు.

ఇక కేఎల్‌ రాహుల్‌ గజ్జల్లో గాయం నుంచి కోలుకొని జింబాబ్వేతో వన్డే సిరీస్‌ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. జింబాబ్వే పర్యటనలో టీమిండియా కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ జట్టును విజయపథంలో నడిపాడు. ఆ సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. అయితే బ్యాటింగ్‌ మాత్రం కేఎల్‌ రాహుల్‌ నిరాశపరిచాడు. జింబాబ్వేతో చివరి రెండు వన్డేల్లో ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ 1, 30 పరుగులు చేశాడు.

చదవండి: Asia Cup 2022: మనసులో మాటను బయటపెట్టిన పాక్‌ ఆల్‌రౌండర్‌

Asia Cup 2022: కోహ్లి, రోహిత్‌ అయిపోయారు.. ఇప్పుడు పంత్‌, జడేజా వంతు

మరిన్ని వార్తలు