‘సూపర్‌ ఓవర్‌లో ఇషాన్‌ను అందుకే పంపలేదు’

29 Sep, 2020 17:05 IST|Sakshi

దుబాయ్‌: రాయల్‌ బెంగళూరుతో జరిగిన నిన్నటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ పోరాడి ఓడిపోయింది. ఇషాన్‌ కిషన్‌ పవర్‌ పంచ్‌తో గెలుపు దిశగా పయనించిన ముంబై ఇండియన్స్‌  మ్యాచ్‌ను టైతో సరిపెట్టుకుంది.  ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడాడు. సౌరవ్‌ తివారీ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్‌ కిషన్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.  కానీ చివర్లో భారీ షాట్‌కు పోయి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఇక ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన తరుణంలో పొలార్డ్‌ ఫోర్‌ కొట్టడంతో మ్యాచ్‌ టై అయ్యింది.ఆపై జరిగిన సూపర్‌ ఓవర్‌లో ఆర్సీబీ గెలిచింది. అయితే సూపర్‌ ఓవర్‌లో పొలార్డ్‌, హార్దిక్‌ పాండ్యాలే ముంబై ఇన్నింగ్స్‌ను ఆరంభించారు. (చదవండి:402 పరుగుల్లో 12 పరుగులే అంటే..)

సూపర్‌ ఓవర్‌లో ఇషాన్‌ కిషన్‌ వచ్చి మళ్లీ చెలరేగుతాడని ముంబై ఫ్యాన్స్‌ ఆశగా చూశారు. కానీ పొలార్డ్‌, హార్దిక్‌లు వచ్చి ఏడు పరుగులే చేశారు. దీనిపై రోహిత్‌ వివరణ ఇచ్చాడు. అసలు ఇషాన్‌ కిషన్‌ను ఎందుకు పంపలేదు అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు. ఇషాంత్‌ హిట్టింగ్‌ చేయగలడు. పొలార్డ్‌-హార్దిక్‌లు కూడా హిట్టర్లే. మేము ఒత్తిడిలో ఉన్న విషయం తెలుసు.  దాన్ని పొలార్డ్‌-హార్దిక్‌లు అధిగమిస్తారనుకున్నాం. హార్దిక్‌ నమ్మదగిన హిట్టర్‌. పొలార్డ్‌ భారీ సిక్స్‌లు కొడతాడు. ఇక ఇషాన్‌ కిషన్‌ ఆందోళనలో ఉన్నాడు. ఇషన్‌ ఫ్రెష్‌గా లేడు. దాంతో అతను సూపర్‌ ఓవర్‌కు సెట్‌ కాడనే ఉద్దేశంతోనే పొలార్డ్‌-హార్దిక్‌లు వెళ్లారు. పొలార్డ్‌తో ఇషాన్‌ను పంపుదామనుకున్నా హార్దిక్‌ను పంపాల్సి వచ్చింది’ అని రోహిత్‌ శర్మ తెలిపాడు.

సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయకేతనం ఎగురవేసింది. సూపర్‌ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కోల్పోయి 7 పరుగులే చేసింది. ముంబై తరఫున హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌లు ఓపెనింగ్‌కు దిగారు. సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌ తొలి బంతికి పొలార్డ్‌ పరుగు తీయగా,రెండో బంతికి పాండ్యా మరో పరుగు సాధించాడు. మూడు బంతికి ఎటువంటి పరుగు రాలేదు. నాల్గో బంతికి పొలార్డ్‌ ఫోర్‌ కొట్టగా, ఐదో బంతికి ఔటయ్యాడు. ఆరో బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఆర్సీబీకి ముంబై ఎనిమిది పరుగుల మాత్రమే నిర్దేశించింది. ముంబై తరఫున బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేయగా, ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలు ఓపెనింగ్‌కు వచ్చారు. వీరిద్దరూ చివరి బంతికి ఎనిమిది పరుగులు సాధించడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. చివరి బంతిని కోహ్లి ఫోర్‌ కొట్టి విజయాన్ని అందించాడు.

Poll
Loading...
మరిన్ని వార్తలు