ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేస్తారా?

5 Nov, 2020 16:27 IST|Sakshi
రోహిత్‌ శర్మ(ఫైల్‌ఫోటో)

దుబాయ్‌: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) ఇచ్చిన సలహాను లెక్కచేయకుండా మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మపై విమర్శలు వస్తున్న సమయంలో మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ అండగా నిలిచాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే రోహిత్‌ ఫిట్‌గా ఉండటం గుడ్‌ న్యూస్‌ అని గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. రోహిత్‌ గాయం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను పక్కను  పెట్టాలని, ప్రస్తుతం అతనికి ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించాలని సూచించాడు. ఒకవేళ రోహిత్‌ ఫిట్‌ అయితే ఆస్ట్రేలియా టూర్‌కు ఎంపిక చేయమని గావస్కర్‌ పేర్కొన్నాడు. (అతని సమయం వస్తుంది: గంగూలీ)

‘రోహిత్‌ ఫిట్‌ కావడం కంటే గుడ్‌ న్యూస్‌ ఏముంటుంది. రోహిత్‌ కెరీర్‌ డేంజర్‌లో పడుతుందని ఆలోచించడం మంచి విషయమే.కానీ రోహిత్‌ ఇప్పుడు ఫిట్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. బౌండరీ లైన్‌ వద్ద, 30 యార్డ్‌ సర్కిల్‌లో ఫీల్డింగ్‌ చేశాడు. మ్యాచ్‌ ఆడి ఫిట్‌నెస్‌ పరంగా బాగానే కనిపించాడు. కావాలంటే బీసీసీఐ అతనికి మరొకసారి ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించవచ్చు. ఫిట్‌గా ఉన్నానని విషయం రోహితే స్వయంగా చెప్పాడు. ఇక పాత విషయాలను పక్కను పెట్టండి. వీలైతే రోహిత్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే జట్టులో చేర్చండి’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌లో గాయపడ్డ హిట్ మ్యాన్ తర్వాత నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు సెలెక్టర్లు రోహిత్‌ను పక్కనపెట్టారు. తొడ కండరాల గాయం కావడం.. అది తీవ్రంగా ఉండటంతో కనీసం 2-3 వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని టీమిండియా ఫిజియో రిపోర్ట్ ఇవ్వడంతో సెలెక్టర్లు రోహిత్‌పై వేటు వేసారు. కానీ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో ఈ వ్యవహారం వివాదాస్పమైంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని, రోహిత్ గాయంపై సీబీఐ దర్యాప్తు జరపాలని అభిమానులను డిమాండ్ చేస్తున్నారు.

ఐపీఎల్‌ ఆడేందుకు తొందరపడవద్దని, సుదీర్ఘ భవిష్యత్తు ఉందంటూ స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సలహా ఇచ్చిన రోజే రోహిత్‌ మైదానంలోకి దిగడం తీవ్రచర్చనీయాంశమైంది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం కంటే.. లీగ్‌ ముఖ్యమా? అని భారత మాజీ చీఫ్‌ సెలక్టర్‌, మాజీ కెప్టెన్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ ప్రశ్నించారు. రోహిత్‌ గాయాన్ని అంచనా వేయడంలో బీసీసీఐ పొరపాటు పడిందా అని నిలదీశాడు. రోహిత్‌ ఫిట్‌నెస్‌ విషయంలో గందరగోళం నెలకొందని అభిప్రాయపడ్డాడు. మరి తాజాగా రోహిత్‌కు గావస్కర్‌ అండగా నిలవడంతో అతనికి ఫిట్‌నెస్‌ టెస్టు చేసి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేస్తారా.. లేదా అనేది చూడాలి.
 

మరిన్ని వార్తలు