హిట్‌మ్యాన్‌ రోహిత్‌కు ఏమైంది..?

25 Oct, 2020 19:13 IST|Sakshi

అబుదాబి:  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ తాత్కాలిక కెప్టెన్‌ పొలార్డ్‌ ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు. సీఎస్‌కేతో గత మ్యాచ్‌కు దూరమైన రోహిత్‌..  ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. దాంతో పొలార్డ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన రెండు సూపర్ల మ్యాచ్‌లో ఓటమి తర్వాత రోహిత్‌ మళ్లీ కనిపించలేదు. ఆ మ్యాచ్‌ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన పొలార్డ్‌.. రోహిత్‌ ఆరోగ్యం బాగోలేదని వెల్లడించాడు. అతను తప్పకుండా తిరిగి జట్టులోకి వస్తాడన్నాడు. రోహిత్‌ పోరాట యోధుడని, మళ్లీ త్వరలోనే జట్టుతో కలుస్తాడన్నాడు. అయితే అసలు రోహిత్‌కు ఏమైందనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. రోహిత్‌కు గాయమా.. లేక జ్వరమా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేకపోవడంతో ఫ్యాన్స్‌ కాస్త నిరాశగా ఉన్నారు. రోహిత్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్‌ ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటనా చేయలేదు. 

ఇదిలా ఉంచితే, ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్‌ 7 విజయాలు సాధించగా,  రాజస్తాన్‌ రాయల్స్‌ 11 మ్యాచ్‌లకు గాను 4 విజయాలు సాధించింది. ఇక ఓవరాల్‌గా ఇరుజట్ల ముఖాముఖి పోరులో ముంబై ఇండియన్స్‌ 11 విజయాలు సాధించగా, రాజస్తాన్‌ రాయల్స్‌ 10సార్లు గెలిచింది. ఈ లీగ్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 57 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ తన చివరి ఐదు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించగా, ముంబై ఇండియన్స్‌ నాలుగు విజయాల్ని సొంతం చేసుకుంది. 

రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు టాప్‌ స్కోరర్లలో సంజూ శాంసన్‌(272), జోస్‌ బట్లర్‌(271), స్టీవ్‌ స్మిత్‌(265)లు వరుస స్థానల్లో ఉండగా, ఆ జట్టు బౌలింగ్‌ యూనిట్‌లో అత్యధిక వికెట్ల తీసిన జాబితాలో జోఫ్రా ఆర్చర్‌(15), రాహుల్‌ తెవాటియా(7), శ్రేయస్‌ గోపాల్‌(7)లు వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు.ముంబై ఇండియన్స్‌ టాప్‌ స్కోరర్లలో డీకాక్‌(368), ఇషాన్‌ కిషన్‌(261), మనీష్‌ పాండే(260)లు వరుస స్థానాల్లో ఉండగా, అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో బుమ్రా(17), ట్రెంట్‌ బౌల్ట్‌(16), రాహుల్‌ చహర్‌(13)లు వరుసగా ఉన్నారు. 

ఆర్చర్‌ వర్సెస్‌ డీకాక్‌
ఈ మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్‌-డీకాక్‌ల మధ్య ఆసక్తికర పోరు జరగవచ్చు. ఆర్చర్‌ 15 వికెట్లను సాధించిన క్రమంలో 6.61 ఎకానమీ కల్గి ఉన్నాడు. ఇది ఈ సీజన్‌లో టాప్‌-5 లీడింగ్‌ వికెట్‌ టేకర్లలో అత్యుత్తమ ఎకానమీగా ఉంది. ఇక ముంబై ఓపెనర్‌ డీకాక్‌ 10 మ్యాచ్‌లకు గాను 368 పరుగులు సాధించాడు. అతని స్టైక్‌రేట్‌ 143.19గా ఉంది. గత చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్‌ సెంచరీలు(53, 78 నాటౌట్‌, 53)లు సాధించగా, మరొక మ్యాచ్‌లో 46 నాటౌట్‌గా ఉన్నాడు.  దాంతో ఆర్చర్‌-డీకాక్‌ల పోరు అభిమానులకు మజాను అందించవచ్చు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు