ఆసీస్‌పై రోహిత్‌ సెంచరీ సిక్సర్ల రికార్డు

8 Jan, 2021 18:11 IST|Sakshi

సిడ్నీ: రోహిత్‌ శర్మ అంటేనే భారీ సిక్సర్లకు పెట్టింది పేరు.. ఒక్కసారి మైదానంలో పాతుకుపోయాడంటే సిక్సర్ల వర్షం కురిపిస్తాడు. ఆసీస్‌ టూర్‌కి కాస్త ఆలస్యంగా  ఎంట్రీ ఇచ్చిన హిట్‌మ్యాన్‌ వచ్చీ రావడంతోనే ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై అన్ని ఫార్మాట్లు కలిపి 100 సిక్సర్లు కొట్టిన ఏకైక​ టీమిండియా ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.(చదవండి: ఆసీస్‌ క్రికెటర్‌పై షేన్‌ వార్న్‌ అసభ్యకర వ్యాఖ్యలు)

సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో నాథన్‌ లయన్‌ బౌలింగ్‌లో లాంగాన్‌ మీదుగా కొట్టిన సిక్స్‌ ద్వారా ఈ ఘనత సాధించాడు. రోహిత్‌ ఆసీస్‌పై కొట్టిన వంద సిక్సర్లలో 63 సిక్స్‌లు వన్డేల్లోనే రావడం విశేషం.తాజాగా మూడో టెస్టులో కొట్టిన సిక్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శ‌ర్మ సిక్స‌ర్ల సంఖ్య 424కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కూ చూసుకుంటే టీమిండియాలో ఏ క్రికెట‌ర్‌కూ ఆసీస్‌పై ఇన్ని సిక్సర్లు బాదిన ఘనత లేదు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన వారిలో రోహిత్ కంటే ముందు ఇద్ద‌రు మాత్రమే ఉన్నారు. అందులో ఒక‌రు విండీస్ విధ్వంస‌క బ్యాట్స్‌మ‌న్ క్రిస్ గేల్ (534 సిక్స‌ర్లు) కాగా.. మ‌రొక‌రు పాకిస్థాన్ బ్యాట్స్‌మ‌న్ షాహిద్ అఫ్రిది (476 సిక్స‌ర్లు). ఒక ప్ర‌త్య‌ర్థిపై వంద సిక్స్‌లు కొట్టిన రెండో ప్లేయ‌ర్ రోహిత్‌. ఇంత‌కుముందు ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి గేల్ 140 సిక్స‌ర్లు కొట్టాడు. రోహిత్‌కు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. వ‌న్డేల్లో త‌న తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసింది ఆస్ట్రేలియాపైనే. 2013లో బెంగ‌ళూరులో జ‌రిగిన వ‌న్డేలో 209 ప‌రుగులు చేయగా.. అందులో ఏకంగా 16 సిక్స‌ర్లు ఉండ‌టం విశేషం. ఆసీస్‌ పేరు చెబితేనే పూనకం వచ్చిన వాడిలా చెలరేగిపోయే హిట్‌మ్యాన్‌ ఆస్ట్రేలియాపై ఇప్పటివరకు 8 సెంచ‌రీలు బాదాడు.(చదవండి: నా ఫోకస్‌ మొత్తం అశ్విన్‌పైనే)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు