15 నెలల తర్వాత.. అన్ని స్వదేశంలోనే

13 Feb, 2021 14:55 IST|Sakshi

చెన్నై: చెపాక్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సూపర్‌ సెంచరీతో చెలరేగాడు. 128 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన రోహిత్ శర్మ 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అచ్చం వన్డే తరహాలో దాటిగా ఆడిన రోహిత్‌ శర్మకు టెస్టుల్లో ఇది ఏడో శతకం కాగా.. చెన్నై వేదికగా సెంచరీ నమోదు చేయడం ఇదే తొలిసారి. 2019 అక్టోబర్‌లో రాంచీలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రోహిత్ శర్మ చివరి సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్‌  212 పరుగులు చేశాడు. కాగా, టెస్టుల్లో రోహిత్ శర్మ నమోదు చేసిన ఏడు సెంచరీలు భారత గడ్డపైనే రావడం విశేషం.

రెండో టెస్టుకు ముందు ఆసీస్‌ పర్యటనలోనూ రోహిత్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆసీస్‌ గడ్డపై మూడు, నాలుగు టెస్టులు ఆడిన రోహిత్‌ వరుసగా 26,52, 44,7 పరుగులు సాధించాడు. అనంతరం ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 6,12 పరుగులు సాధించాడు. గత మూడు టెస్టులు కలిపి 24 సగటుతో 147 పరుగులు మాత్రమే చేశాడు.

యువ ఓపెనర్ శుభమన్ గిల్ (0) రెండో ఓవర్‌లోనే డకౌటవగా.. ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ ఏ దశలోనూ పట్టుదల వీడలేదు. చతేశ్వర్ పుజారా (21)తో కలిసి రెండో వికెట్‌కి దూకుడుగా ఆడి 85 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కోహ్లి, పుజారాలు అవుటైన తర్వాత మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించిన రోహిత్‌ రహానేతో కలిసి మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. ముఖ్యంగా స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్, కట్ షాట్లతో రోహిత్ శర్మ అదరగొట్టాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

చదవండి:
'కమాన్‌ రోహిత్‌.. యూ కెన్‌ డూ ఇట్‌'

కోహ్లి పేరిట మరో చెత్త రికార్డు

మరిన్ని వార్తలు