IND VS SL 2nd Test: కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు.. క్రికెట్‌ చరిత్రలో ఒకే ఒక్కడు

14 Mar, 2022 21:36 IST|Sakshi

Rohit Sharma: శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ (2-0) చేయడం ద్వారా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఖాతాలో ఓ అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఫుల్‌టైమ్‌ కెప్టెన్‌గా అరంగేట్రం సిరీస్‌ల్లోనే (మూడు ఫార్మాట్లు) క్లీన్ స్వీప్ విజయాలు సాధించిన తొలి సారథిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు.కోహ్లి నుంచి ఫుల్ టైమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వన్డే (3-0), టీ20 సిరీస్ (3-0)‌ల్లో వైట్‌వాష్‌ చేసిన రోహిత్‌.. తాజాగా శ్రీలంకను టెస్ట్ సిరీస్‌లో 2-0 తేడా‌తో క్లీన్‌ స్వీప్‌ చేయడం ద్వారా మూడు ఫార్మాట్లలో అరంగేట్రం సిరీస్‌ల్లో క్లీన్‌ స్వీప్‌ విజయాలు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.


కాగా, బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్‌ బాల్‌ టెస్ట్‌లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అంతకుముందు మొహాలీలో జరిగిన తొలి టెస్ట్‌లోనూ లంకపై భారీ విజయం (ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో) సాధించిన రోహిత్‌ సేన.. టెస్ట్‌ సిరీస్‌కు ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కూడా 3-0 తేడాతో వైట్‌వాష్‌ చేసింది. ఈ భారత పర్యటనలో శ్రీలంక ఒక్క మ్యాచ్‌ కూడా గెలుపొందలేక రిక్త హస్తాలతో స్వదేశానికి తిరుగు పయనమైంది. రెండో టెస్ట్‌  రెండు ఇన్నింగ్స్‌ల్లో అర్ధసెంచరీలతో రాణించిన శ్రేయస్ అయ్యర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యంతం రాణించిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది. 

రెండో టెస్ట్‌ సంక్షిప్త స్కోర్లు:

భారత్ తొలి ఇన్నింగ్స్ : 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92, జయవిక్రమ 3/81)

శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24)

భారత్ రెండో ఇన్నింగ్స్ : 303/9 డిక్లేర్‌ ( శ్రేయస్‌ అయ్యర్‌ 67, జయవిక్రమ 4/78)

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: 208 (కరుణరత్నే 107, అశ్విన్‌ 4/55)
చదవండి: టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా తిరుగులేని రికార్డు.. ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా..!


 

మరిన్ని వార్తలు