T20 WC 2022: మేము చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయాం! సూర్య అద్భుతం

31 Oct, 2022 08:19 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం పెర్త్‌ వేదికగా దక్షిణాప్రికాతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. దక్షిణాఫ్రికా పేసర్లు చెలరేగడంతో 49 పరుగులుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ సమయంలో భారత్‌ విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 40 బంతుల్లో 6 ఫోర్లు, మూడు సిక్సర్లతో 68 పరుగులు సాధించాడు. సూర్యకుమార్‌ కీలక ఇన్నింగ్స్‌ ఫలితంగా భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది.

షాకిచ్చిన అర్ష్‌దీప్‌
134 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దక్షిణాఫ్రికాకు అర్ష్‌దీప్‌ సింగ్‌ ఆరంభంలోనే బిగ్‌ షాకిచ్చాడు. ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌.. ఫామ్‌లో ఉన్న డికాక్‌, రౌసౌను పెవిలియన్‌కు పంపాడు. అనంతరం షమీ ప్రోటీస్‌ కెప్టెన్‌ బావుమాను కూడా ఔట్‌ చేశాడు. దీంతో కేవలం 24 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది.

ఈ సమయంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు మార్‌క్రమ్‌, మిల్లర్‌ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయం వైపు అడుగులు వేయించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 78 పరుగుల కీలక భాగస్వా‍మ్యం నెలకొల్పారు. అనంతరం మార్‌క్రమ్‌(52) ఔటైనప్పటికీ.. మిల్లర్‌(59 పరుగులు) మాత్రం అఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మిల్లర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఫలితంగా దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

కొంపముంచిన ఫీల్డింగ్‌
భారత్‌కు బౌలింగ్‌లో అద్భుతమైన అరంభం లభించినప్పటికీ.. ఫీల్డింగ్‌లో మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. ఫీల్డింగ్‌లో చేసిన తప్పిదాలు వల్లే ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించి ప్రోటీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన మార్‌క్రమ్‌కు భారత్‌ ఫీల్డర్లు మూడు అవకాశాలు ఇచ్చారు. తొలుత విరాట్ కోహ్లి ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టగా.. కెప్టెన్‌ రోహిత్‌ రెండు సార్లు సులభమైన రనౌట్లను మిస్‌ చేశాడు. రెండు సార్లు బతికిపోయిన మార్‌క్రమ్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు.

ఓ ఓటమికి కారణం ఇదే
ఇక ఈ మ్యచ్‌ అనంతరం ఓటమిపై భారత్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు."ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్‌ దారుణంగా ఉంది. కీలక సమయంలో వచ్చిన అవకాశాలను వదిలేశాం. క్యాచ్‌లుతో పాటు కొన్ని రనౌట్స్‌ను కూడా మిస్‌ చేసుకున్నాం. ముఖ్యం రెండు సార్లు రనౌట్స్‌ను నేనే మిస్‌ చేశాను. మేము ఫీల్డింగ్‌లో ఇంకా చాలా మెరుగుపడాలి. ఇక బ్యాటింగ్‌లో కూడా అంతగా రాణించ లేకపోయాం. కానీ సూర్య ఆడిన ఇన్నింగ్స్‌ అద్భుతం.  బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఇటువంటి తప్పిదాలు చేయకుండా జాగ్రత్తపడతాము" అని రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

అందుకే అశ్విన్‌కి ఇచ్చాము
ఇక ప్రోటీస్‌ ఇన్నింగ్స్‌ కీలక 18వ ఓవర్‌ను స్పిన్నర్‌ అశ్విన్‌కు ఇవ్వడం భారత్‌ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ ఓవర్‌లో మిల్లర్‌ రెండు సిక్స్‌లు బాది మ్యాచ్‌ను తమ వైపు మలుపు తిప్పుకున్నాడు. ఈ ఓవర్‌లో దక్షిణాఫ్రికా 13 పరుగులు సాధించింది. ఇక ఈ విషయంపై కూడా రోహిత్‌ స‍్పందించాడు.

"స్పిన్నర్‌కు అఖరి ఓవర్‌ ఇస్తే ఏం జరిగిందో గత మ్యాచ్‌ల్లో మనం చూశాం. అందుకే అఖరి ఓవర్‌లోపు అశ్విన్‌ కోటాను పూర్తి చేయాలి అనుకున్నాను. క్రీజులోకి కొత్త బ్యాటర్ వచ్చినందున, అశ్విన్ బౌలింగ్ చేయడానికి ఇదే సరైన సమయం అని భావించాను. అయితే మా ప్రాణాళికలను మిల్లర్‌ దెబ్బతీశాడు" అని రోహిత్‌ తెలిపాడు.
చదవండి: T20 WC 2022: ప్రపంచకప్‌లో భారత్‌కు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆటగాడు దూరం!

మరిన్ని వార్తలు