Rohit Sharma: 'ర్యాంకులు పట్టించుకోం.. ఆసీస్‌తో సిరీస్‌ అంత ఈజీ కాదు'

25 Jan, 2023 07:33 IST|Sakshi

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో టీమిండియా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శుబ్‌మన్‌ గిల్‌ విధ్వంసరకర ఫామ్‌ను కొనసాగించగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సెంచరీతో టచ్‌లోకి రావడం మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలకు రోహిత్‌ సెంచరీతో చెక్‌ పెట్టాడు.

ఈ విజయంతో టీమిండియా వన్డేల్లో నెంబర్‌వన్‌ స్థానాన్ని అధిరోహించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ విజయం అనంతరం రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. ర్యాంకులు మాకు ముఖ్యం కాదని.. ప్రణాళికలకు తగినట్లుగా ఆడడం వన్డే క్రికెట్‌లో చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా రోహిత్‌ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అలాంటి యువ బ్యాటర్‌ ప్రస్తుతం జట్టుకు చాలా అవసరమని తెలిపాడు. రాబోయే ఆసీస్‌ సిరీస్‌ తమకు కఠినమైనదని గెలవడం అంత ఈజీ కాదన్నాడు. రోహిత్‌ ఇంకా ఏమన్నాడంటే..

''ప్రణాళికలకు తగ్గట్లు రాణించడం వన్డే క్రికెట్‌లో చాలా ముఖ్యం. మేం మా వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంతోనే గత 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించాం. నిలకడగా రాణించడం కూడా మా విజయాలకు కలిసొచ్చింది. సిరాజ్, షమీ లేకుండా బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకున్నాం. చాహల్, ఉమ్రాన్ మాలిక్‌లను తుది జట్టులోకి తీసుకొని తీవ్ర ఒత్తిడిలో ఎలా రాణిస్తారోనని పరీక్షించాలనుకున్నాం. బోర్డుపై పరుగులున్నా.. ఈ వికెట్‌పై ఎంత పెద్ద లక్ష్యమైనా సరిపోదనే విషయం నాకు తెలుసు.

మేం ప్రణాళికలకు కట్టుబడి రాణించి విజయాన్నందుకున్నాం. చాలా రోజులుగా శార్దూల్ సత్తా చాటుతున్నాడు. జట్టులో అతన్ని అందరూ మెజిషియన్ అంటారు. అవసరమైనప్పుడల్లా బ్యాట్, బంతితో మెరుస్తాడు. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కుల్దీప్ యాదవ్‌కు బంతిని అందించినప్పుడల్లా సత్తా చాటుతున్నాడు. జట్టుకు కావాల్సిన వికెట్లు తీసి బ్రేక్‌త్రూ అందిస్తున్నాడు. మణికట్టు స్పిన్నర్లు గేమ్ టైమ్‌తో మెరుగవుతారు.

ప్రతీ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ అప్రోచ్ ఒకేలా ఉంటుంది. ప్రతీ మ్యాచ్‌ను కొత్తగా ప్రారంభించాలనుకుంటాడు. జట్టులోకి వచ్చిన ఓ యువకుడు అలాంటి వైఖరి కలిగి ఉండటం గొప్ప విషయం. నేను సెంచరీ సాధించడం సంతోషంగా ఉంది. గత కొంత కాలంగా రాణిస్తున్న నాకు ఈ సెంచరీ అదనపు మైలురాయి లాంటిది.  పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. ర్యాంకింగ్స్‌ను మేం పెద్దగా పట్టించుకోం. మైదానంలో ఎలా రాణించాలనేదానిపైనే చర్చిస్తాం. ఆస్ట్రేలియా నాణ్యమైన జట్టు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆ టీమ్‌పై గెలవడం అంత సులువైన పని కాదు. కానీ మేం పై చేయి సాధిస్తామని నమ్మకం ఉంది'' అంటూ  చెప్పుకొచ్చాడు.

ఇక వన్డే సిరీస్‌ అనంతరం ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ జరగనుంది. జనవరి 27, 29, ఫిబ్రవరి 1వ తేదీల్లో మూడు టి20లు జరగనున్నాయి. 

చదవండి: IND VS NZ 3rd ODI: నంబర్‌ వన్‌ జట్టుగా అవతరించిన టీమిండియా

మరిన్ని వార్తలు