హార్దిక్‌ పూర్తి ఫిట్‌గా లేడు: జహీర్‌

28 Sep, 2020 18:17 IST|Sakshi
ముంబై ఇండియన్స్‌(ఫైల్‌ఫోటో)

దుబాయ్‌: ఐపీఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకూ రెండు మ్యాచ్‌లు ఆడిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించింది. సీఎస్‌కేతో జరిగిన ఆరంభపు మ్యాచ్‌లో ముంబై ఓటమి పాలైంది. ఇక కేకేఆర్‌తో ఆడిన తన రెండో మ్యాచ్‌లో ముంబై 49 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(80), సూర్యకుమార్‌ యాదవ్‌(47)లు రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈరోజు ఆర్సీబీతో మ్యాచ్‌లో టాపార్డర్‌ పూర్తిస్థాయిలో రాణించాల్సిన అవసరం ఉందని రోహిత్‌ పేర్కొన్నాడు. దీనిపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిపాడు. ‘ మేము సీఎస్‌కేతో ఓడిపోయిన తర్వాత మేము చేసిన తప్పిదాలు ఏమిటో తెలుసుకున్నాం. టాపార్డర్‌ విఫలం కావడంతోనే ఓటమి చెందాం. ప్రధానంగా టాప్‌-4లో ఉన్న బ్యాట్స్‌మన్‌ రాణించాల్సిన అవసరం ఉంది. మంచి టార్గెట్‌ను సెట్‌ చేయాలన్నా, ఛేజింగ్‌ చేయాలన్నా టాపార్డర్‌దే భారం’ అని రోహిత్‌ తెలిపాడు.

ఇంకా హార్దిక్‌ పూర్తిగా ఫిట్‌గా లేడు: జహీర్‌
ముంబై ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయకపోవడంపై ఆ జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జహీర్‌ స్పందించాడు. ఇంకా హార్దిక్‌ ఫిట్‌గా లేకపోవడం వల్లే బౌలింగ్‌ చేయించడం లేదన్నాడు. హార్దిక్‌ వచ్చినా 100 శాతం ఫిట్‌నెస్‌ లేడన్నాడు. అతనికి గాయం తిరగబెట్టే అవకాశం ఉన్నందున బౌలింగ్‌ చేయించడం లేదన్నాడు. ప్రస్తుతానికి అతని బ్యాటింగ్‌నే వినియోగించుకుంటున్నట్లు తెలిపాడు. త్వరలో హార్దిక్‌ బౌలింగ్‌ చేస్తాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈరోజు ఆర్సీబీతో ముంబై ఇండియన్స్‌ తలపడనుంది. దుబాయ్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.(చదవండి: తెవాటియా.. ఐయామ్ వెరీ సారీ: మాజీ చీఫ్‌ సెలక్టర్‌)

మరిన్ని వార్తలు