'కోచ్‌గా ఉన్నప్పుడు'.. రవిశాస్త్రిపై రోహిత్‌ శర్మ ఆగ్రహం

8 Mar, 2023 17:48 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ టీమిండియా కొంప ముంచిందంటూ రవిశాస్త్రి కామెంటేటరీ బాక్స్‌ నుంచి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు రోహిత్‌ శర్మకు ఆగ్రహం తెప్పించింది. అహ్మదాబాద్‌ వేదికగా నాలుగో టెస్టుకు సిద్ధమవుతున్న వేళ​ మీడియాతో మాట్లాడిన రోహిత్‌ పరోక్షంగా రవిశాస్త్రిపై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

''నిజాయితీగా చెప్పాలంటే మేం రెండు మ్యాచ్‌లు గెలిచాం. బయటి వ్యక్తులేమో అది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అంటున్నారు. వాస్తవానికి ఆ వ్యాఖ్యలు చాలా చెత్తగా ఉన్నాయి. ఎందుకంటే ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నిస్తాం. రెండు మ్యాచ్‌లు గెలవడం ద్వారా అంతా అయిపోలేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించుకుంటే మంచిది. ఒకప్పుడు ఆయన కూడా ఆరేళ్ల పాటు జట్టుకు కోచ్‌గా ఉన్నారు. మరి అప్పుడు ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ఎక్కడా కనిపించలేదా?. అయినా బయట ఉండే వ్యక్తులకు డ్రెస్సింగ్‌ రూమ్‌లో జరిగే విషయాలు ఎలా తెలుస్తాయి.

అందుకే బయటి వ్యక్తులు చేసే వ్యాఖ్యలను పట్టించుకోము. నిజానికి మాది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ కాదు.. కనికరం లేకుండా ప్రత్యర్థి జట్లకు ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా ఆడాలనే మైండ్‌సెట్‌లో ఉండడం జరుగుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. గెలవగానే మెచ్చుకునే నోర్లు ఒక్క మ్యాచ్‌ ఓడిపోగానే విమర్శలు చేస్తుంటాయి. ఇవన్నీ పట్టించుకునే సమయం లేదు.. మ్యాచ్‌పై దృష్టి సారించాలి'' అంటూ పేర్కొన్నాడు.

ఇక అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి(గురువారం) జరగనున్న నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ ఓడినా.. డ్రా చేసుకున్న ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియగా.. తొలి రెండు టీమిండియా గెలవగా.. ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 

చదవండి: సర్జరీ విజయవంతం.. బుమ్రా రీఎంట్రీ అప్పుడే!

Rahul Dravid: డబ్ల్యూటీసీ వల్లే ఇదంతా..

మరిన్ని వార్తలు