ఫిట్‌నెస్‌ వేటలో రోహిత్‌ శర్మ

20 Nov, 2020 08:08 IST|Sakshi

ఎన్‌సీఏలో రోహిత్‌

బెంగళూరు : ‘రోహిత్‌ శర్మ 70 శాతం ఫిట్‌నెస్‌తో మాత్రమే ఉన్నాడు’...ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చేసిన వ్యాఖ్య ఇది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు మాత్రమే ఎంపిౖMðన రోహిత్‌ ఫిట్‌నెస్‌పై సందిగ్ధత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐపీఎల్‌ ముగిసిన వారం రోజుల తర్వాత రోహిత్‌ శర్మ జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) లోకి అడుగు పెట్టాడు. గాయాలపాలైన భారత క్రికెటర్లకు ఇది పునరావాస కేంద్రం. బోర్డు వైద్యుల పర్యవేక్షణలో కోలుకోవడంతో పాటు ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌ కూడా ఇక్కడే నిరూపించుకోవాల్సి ఉంటుంది. పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. రోహిత్‌ ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరయ్యేందుకు ఇక్కడకు వచ్చాడా.. నిజంగా కండరాల గాయంతో బాధపడుతూ కోలుకునేందుకు వచ్చాడా అనే విషయంపై స్పష్టత లేదు. అయితే రోహిత్‌ పూర్తి ఫిట్‌గా లేడనేది మాత్రం వాస్తవం. అతను బోర్డు హెచ్చరికను ఖాతరు చేయకుండా అదే గాయంతో ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు కూడా ఆడాడు. చీఫ్‌ సెలక్టర్‌ సునీల్‌ జోషి పర్యవేక్షణలో రోహిత్‌ ఎన్‌సీఏలో తన ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుంది.

పుజారా కూడా ... 
ఆస్ట్రేలియా గడ్డపై భారత క్రికెటర్ల సన్నాహకాలు జోరుగా సాగుతున్నాయి. టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా కూడా గురువారం తన ప్రాక్టీస్‌ను ప్రారంభించాడు. జట్టు ప్రధాన బౌలర్లు ఉమేశ్‌ యాదవ్, అశ్విన్‌లతో పాటు నెట్‌ బౌలర్లుగా వెళ్లిన ఇషాన్‌ పొరేల్, కార్తీక్‌ త్యాగి విసిరిన బంతులను పుజారా సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఐపీఎల్‌ ఆడే అవకాశం రాని పుజారా చివరి సారిగా మార్చిలో సౌరాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీ ఫైనల్లో  బరిలోకి దిగాడు. సాధనలో పుజారా తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడుతుండటం బీసీసీఐ పెట్టిన వీడియోలో కనిపించింది. మరో వైపు కరోనా బారిన పడి భారత జట్టుతో పాటు వెళ్లలేకపోయిన త్రో డౌన్‌ స్పెషలిస్ట్‌ రఘు కోలుకొని ఇప్పుడు ఆసీస్‌ గడ్డపై అడుగు పెట్టాడు. నిబంధనల ప్రకారం రెండు వారాల క్వారంటైన్‌ తర్వాత అతను టీమిండియా ప్రాక్టీస్‌లో భాగమవుతాడు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా