చేతి వేలికి ఫ్రాక్చర్‌ కాలేదు.. ఎముక పక్కకు జరిగింది: రోహిత్‌ శర్మ

8 Dec, 2022 09:36 IST|Sakshi

బుధవారం ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో​ జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో భారత్‌ పరజాయం పాలైంది. భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అఖరి వరకు పోరాడనప్పటికీ జట్టును గెలిపించకలేకపోయాడు. కాగా బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌లో రోహిత్‌ ఫీల్డింగ్‌ చేస్తుండగా కుడి చేతి బొటనవేలికి గాయమైంది. వెంటనే ఫీల్డ్‌ను విడిచి వెళ్లిన రోహిత్‌ చికిత్స చేయించుకుని తిరిగి బ్యాటింగ్‌లో 9వ స్థానంలో వచ్చాడు.

అఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన హిట్‌మ్యన్‌ ఒక వైపు నొప్పిని భరిస్తునే.. బంగ్లా ఆటగాళ్లకు చెమటలు పట్టించాడు. చివరి ఓవర్‌లో 20 రన్స్‌ అవసరం కాగా.. ముస్తఫిజుర్‌ వేసిన ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టాడు. ఈ క్రమంలో అఖరి బంతికి 6 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. రోహిత్‌ ఒక్క పరుగు కూడా సాధించ లేకపోయాడు.

దీంతో రోహిత్‌ విరోచిత పోరాటం వృధా అయిపోయింది. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న రోహిత్‌.. 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో 51 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా గాయపడిన రోహిత్‌ ఈ సిరీస్‌లో అఖరి వన్డేకు దూరమయ్యాడు. టెస్టులకు కూడా అతడి అందుబాటుపై సందిగ్ధం నెలకొంది.

ఇక మ్యాచ్‌ అనంతరం తన గాయం గురించి రోహిత్‌ శర్మ అప్‌డేట్‌ ఇచ్చాడు. తన వేలికి ఫ్రాక్చర్‌ అయితే కాలేదని, ఎముక కాస్త జరిగినట్లు రోహిత్‌ తెలిపాడు." నిజం చెప్పాలంటే చాలా నొప్పితోనే ఈ మ్యాచ్‌ బ్యాటింగ్‌ చేశాను. నా బొటనవేలు సరిగ్గా లేదు. వేలి ఎముక కాస్త పక్కకు జరిగింది. కొన్ని కుట్లు పడ్డాయి.

అయితే దేవుడు దయవల్ల ఫ్రాక్చర్‌ మాత్రం కాలేదు. అందుకే నేను బ్యాటింగ్‌ వచ్చాను. ప్రతీ మ్యాచ్‌లోనూ పాజిటివ్‌, నెగెటివ్‌లు ఉంటాయి. కానీ 70 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి ఉన్న బంగ్లాను 270 పరుగుల వరకు రానివ్వడం కచ్చితంగా బౌలర్ల విఫలమే అని" రోహిత్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND vs BAN: రోహిత్‌ భయ్యా నీ ఇన్నింగ్స్‌కు హ్యాట్సప్‌.. ఓడిపోయినా పర్వాలేదు

మరిన్ని వార్తలు