Dinesh Karthik Vs Rishabh Pant: పంత్‌ కంటే కార్తీక్‌కు అవకాశం ఇవ్వడం అవసరం: రోహిత్‌ శర్మ

27 Sep, 2022 09:24 IST|Sakshi
కార్తీక్‌, రోహిత్‌ శర్మ(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: ఆసియా కప్‌ నుంచి ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌ వరకు ఒకే స్థానం కోసం కీపర్‌ దినేశ్‌ కార్తీక్, రిషభ్‌ పంత్‌ మధ్య పోటీ కొనసాగుతోంది. ఆసియా కప్‌లో పంత్‌కు అవకాశం దక్కగా, ఆసీస్‌తో మూడు మ్యాచుల్లోనూ కార్తీక్‌ బరిలోకి దిగాడు. వీరిద్దరు కలిసి ఒక మ్యాచ్‌ ఆడారు. అయితే మూడు మ్యాచ్‌లు కలిపినా కార్తీక్‌ మొత్తం ఆడింది 7 బంతులే. అందుకే ప్రపంచకప్‌కు ముందు అతనికి మరింత ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ భావిస్తున్నాడు.

ఇదే విషయాన్ని అతను ఆస్ట్రేలియాతో సిరీస్‌ నెగ్గిన అనంతరం స్పష్టం చేశాడు. ‘ప్రపంచకప్‌కు ముందు వీరిద్దరు కూడా సాధ్యమైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని నేను కోరుకుంటున్నా. అయితే పంత్‌తో పోలిస్తే కార్తీక్‌ మరింత ఎక్కువసేపు క్రీజ్‌లో గడపడం అవసరం. ఈ సిరీస్‌లో అతనికి దాదాపుగా బ్యాటింగ్‌ అవకాశమే రాలేదు.

అందుకే అతడిని ఎక్కువగా ఆడిస్తున్నాం’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు. రాబోయే దక్షిణాఫ్రికా సిరీస్‌లో కూడా వీరిద్దరు విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తానో ఇప్పుడే చెప్పలేనని రోహిత్‌ అన్నాడు. ‘ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను బట్టి మా ప్రణాళిక ఉంటుంది.

ఎడంచేతి వాటం బ్యాటర్‌ అవసరమైతే పంత్‌ను, కుడిచేతి వాటం బ్యాటర్‌ అవసరమైతే కార్తీక్‌ను ఆడిస్తాం. పరిస్థితిని బట్టి ప్రణాళికలు ఉంటాయి. అయితే అందరినీ తగిన విధంగా వాడుకుంటాం. వరల్డ్‌కప్‌కు ముందు చాలా తక్కువ మ్యాచ్‌లే ఉన్నాయని తెలుసు. కానీ ఆడేది 11 మందే కదా’  అని రోహిత్‌ చెప్పాడు.
చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. హార్దిక్‌ దూరం.. యువ ఆల్‌రౌండర్‌కు చోటు!

మరిన్ని వార్తలు