ఐపీఎల్‌ ఆపేసి మంచి పని చేశారు: రోహిత్

6 May, 2021 17:10 IST|Sakshi

ముంబై: ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు తర్వాత ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలిసారి స్పందించాడు. ముంబై ఇండియన్స్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్‌ మాట్లాడిన వ్యాఖ్యలను షేర్‌ చేసింది. ఈ వీడియోలో రోహిత్‌తో పాటు బుమ్రా, ఆడమ్‌ మిల్నే, జయంత్‌ యాదవ్‌, షేన్‌ బాండ్‌, రాబిన్‌ సింగ్‌ కూడా ఉన్నారు.

''ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఐపీఎల్‌ టోర్నీని రద్దు చేసి బీసీసీఐ మంచి పని చేసింది. దేశం మొత్తం కరోనాతో అతలాకుతులమవుతున్న సమయంలో ఐపీఎల్‌ ద్వారా కాస్త ఉపశమనం కలిగిద్దా అని భావించాం. అయితే దురదృష్టవశాత్తూ బయోబబూల్‌ సెక్యూర్‌లో ఉన్న మాకు కూడా కరోనా సెగ తగిలింది. ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుంటే లీగ్‌ నిర్వహించడం కాస్త కష్టతరమవుతుంది. ఇలాంటి సమయంలో లీగ్‌ను వాయిదా లేదా రద్దు చేయడమే సరైన పని. బీసీసీఐ సరైన నిర్ణయమే తీసుకుంది. ఐపీఎల్‌లో ఇంతవరకు జరిగిన మ్యాచ్‌లకు మీరు ఇచ్చిన సహకారం మరువలేనిది.. పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఐపీఎల్‌ను నిర్వహిస్తారని ఆశిస్తున్నా. మనం మళ్లీ కలిసేవరకు దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి. మనమంతా ఒక ఫ్యామిలీలా ఉండి దేశాన్ని కరోనా సంక్షోభం నుంచి తప్పిద్దాం. స్టే హోమ్‌.. స్టే సేఫ్‌ ఫ్రమ్‌ ముంబై ఇండియన్స్‌ అంటూ'' ముగించాడు.

ఈ సీజన్‌లో రోహిత్‌ శర్మ సారధ్యంలోని ముంబై ఇండియన్స్‌ 7 మ్యాచ్‌లాడి 4 విజయాలు.. 3 ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆరంభం నుంచి పడుతూ లేస్తూ సాగిన ముంబై ఇండియన్స్‌ ఆట.. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో చాంపియన్‌ ఆటతీరు ఎలా ఉంటుందో రుచి చూపెట్టింది. సీఎస్‌కే నిర్దేశించిన 219 పరుగుల లక్ష్యాన్ని చేధించి సత్తా చాటింది. కీరన్‌ పొలార్డ్‌ ఒంటిచేత్తో ముంబైకి విజయాన్ని అందించడం ఈ సీజన్‌లో హైలెట్‌గా చెప్పొచ్చు. 
చదవండి: అదే మైండ్‌సెట్‌తో బరిలోకి దిగాం: రోహిత్‌

A post shared by Mumbai Indians (@mumbaiindians)

మరిన్ని వార్తలు