వామ్మో రోహిత్‌.. ఇంత క‌సి ఉందా!

9 Sep, 2020 18:29 IST|Sakshi

దుబాయ్ : ఐపీఎల్ అంటేనే ఫోర్లు, సిక్స‌ర్లతో పాటు బారీ హిట్టింగ్‌లు క‌నిపిస్తాయి. ఐపీఎల్‌లో ఎవ‌రి సిక్స్ ఎంత దూరం వెళుతుంద‌న్న‌ది రికార్డుల్లో లెక్కేస్తారు. టీమిండియా ఆట‌గాడు.. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంటేనే భీక‌ర‌మైన‌ హిట్టింగ్‌కు పెట్టింది  పేరు. బ్యాటింగ్ ఆడేట‌ప్పుడు రోహిత్ శ‌ర్మ ఎంత క‌సిగా ఉంటాడ‌నేది ఇప్ప‌టికే చాలాసార్లు చూశాం. అత‌ను బంతిని బ‌లంగా బాదాడంటే.. స్టేడియం అవ‌త‌ల ప‌డాల్సిందే. తాజాగా దుబాయ్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 13వ సీజ‌న్‌కు స‌న్న‌ద్ద‌మ‌య్యేందుకు ఆట‌గాళ్లు త‌మ ప్రాక్టీస్‌ను కొన‌సాగిస్తున్నారు. కాగా ఈ సీజ‌న్‌లో చెన్నైతో జ‌రిగే మొద‌టి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డనున్న సంగ‌తి తెలిసిందే. (చ‌ద‌వండి : 6 నెల‌ల త‌ర్వాత తొలిసారి విమానం ఎక్కా)

ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్  కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అబుదాబి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒక‌టి ఆ జ‌ట్టు యాజ‌మాన్యం షేర్ చేసింది. ఆ వీడియోలో బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న రోహిత్ స్పిన్న‌ర్ వేసిన బంతిని బారీ సిక్స్‌గా మ‌లిచాడు.  95 మీట‌ర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి స్టేడియం బ‌య‌ట‌కు వెళ్లి రోడ్డు మీద వెళ్తున్న బ‌స్సు రూఫ్‌టాప్‌పై ప‌డింది. ఇంకేముంది.. బౌలింగ్ వేసిన స్పిన్న‌ర్ బిత్త‌ర‌చూపులు చూడగా.. రోహిత్ విజ‌య‌సంకేతం చూపించాడు. దాదాపు నాలుగు నెల‌ల త‌ర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేప‌ట్టిన రోహిత్ బారీ షాట్ల‌తో రీచార్జ్ అయిన‌ట్లే క‌నిపిస్తుంది. రానున్న మ్యాచ్‌లో త‌న విధ్వంసం ఎలా ఉండ‌బోతుందో చెప్ప‌క‌నే చెప్పాడు.

ఈ వీడియోను ముంబై ఇండియ‌న్స్ త‌న ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ వినూత్న కాప్ష‌న్‌ను రాసుకొచ్చింది. 'బ్యాట్స్‌మెన్లు సిక్స్‌లు కొడతారు.. లెజెండ్స్ స్టేడియాల‌ను క్లియ‌ర్ చేస్తారు.. కానీ హిట్‌మ్యాన్ మాత్రం మూడు ప‌నులు( బారీ సిక్స్‌+ స్టేడియం అవ‌త‌ల + వాహ‌‌నాల‌పై ప‌డ‌డం) క‌లిపి చేస్తాడు. అది ఒక్క రోహిత్‌కే సాధ్యం' అంటూ కామెంట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడిమో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అయితే వీడియో చివ‌ర్లో నీ సిక్స్‌తో బ‌స్సు అద్దాల‌ను గాని ప‌గ‌ల‌గొట్టావా అంటూ రోహిత్‌ను ఎవ‌రో అడిగినట్లు వినిపిస్తుంది. కాగా అంత‌కుముందు ప్రాక్టీస్ సంద‌ర్భంగా ముంబై ప్ర‌ధాన బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ స‌మ‌యంలో ఆరు బంతులను ఆరుగురు బౌల‌ర్ల‌ను ఇమిటేట్ చేస్తూ విసిరిన వీడియో కూడా వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. (చ‌ద‌వండి : 'ఐపీఎల్‌లో ఆడనందుకు నాకు బాధ లేదు')

మరిన్ని వార్తలు