IND vs NZ: నేను అనుకున్నది జరగలేదు.. అతడు మాత్రం భయపెట్టాడు: రోహిత్‌ శర్మ

19 Jan, 2023 09:04 IST|Sakshi

హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. భారత్‌ గెలుపొందినప్పటికీ.. న్యూజిలాండ్‌ లోయార్డర్‌ బ్యాటర్‌ మైఖేల్‌ బ్రెస్‌వెల్‌ తన అద్భుత ఇన్నింగ్స్‌తో భయపెట్టాడు. 348 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. ఓ దశలో 200 పరుగులలోపే ఆలౌట్‌ అవుతందని అంతా భావించారు.

కానీ బ్రెస్‌వెల్‌ తన పోరాట పటిమతో న్యూజిలాండ్‌ను గెలుపు అంచుల వరకు తీసుకువచ్చాడు. ఆఖరి ఓవర్‌లో కివీస్‌ విజయానికి 20 పరుగుల కావల్సిన నేపథ్యంలో.. శార్థూల్‌ ఠాకూర్‌కు రోహిత్‌ శర్మ బంతిని అందించాడు. తొలి బంతినే బ్రెస్‌వెల్‌ స్టాండ్స్‌కు తరలించాడు.

దీంతో స్టేడియం మొత్తం ఒక్క సారిగా నిశ్భబ్దం అయిపోయింది. అనంతరం రెండో బంతిని శార్థూల్‌ వైడ్‌గా వేశాడు. న్యూజిలాండ్‌ విజయానికి 5 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి. ఈ ‍క్రమంలో శార్థూల్‌ అద్భుతమైన బంతితో బ్రెస్‌వెల్‌ను ఔట్‌ చేశాడు. దీంతో అంతా ఒక్క సారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో కేవలం 78 బంతులు ఎదుర్కొన్న బ్రెస్‌వెల్‌ 12 ఫోర్లు, 10 సిక్స్‌లతో 140 పరుగులు సాధించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్‌, బ్రెస్‌వెల్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో రోహిత్‌ మాట్లాడుతూ.. "నిజం చెప్పాలంటే బ్రెస్‌వెల్‌ బ్యాటింగ్‌ చేసే విధానం, అతడి షాట్‌ సెలక్షన్‌ అద్భుతం. ఓ దశలో ఓటమి తప్పదని అనుకున్నాను.

ఈ మ్యాచ్‌లో బాగా బౌలింగ్‌ చేస్తే మేము విజయం మాదేనని, బంతితో రాణించకపోతే కష్టమవుతుందనే విషయం మాకు ముందే తెలుసు. దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో అదే జరిగింది. టాస్‌ సమయంలోనే నేను చెప్పాను. బౌలర్లకు సవాలు విసిరేందుకు తొలుత బ్యాటింగ్‌ తీసుకున్నాను. కానీ నేను అనుకున్నది జరగలేదు. డెత్‌ఓవర్లలో బౌలర్లు తెలిపోవడం మళ్లీ పునరావృతమైంది" అని రోహిత్‌ పేర్కొన్నాడు.

ఇక గిల్‌ గురించి మాట్లాడుతూ.. "గిల్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టి ఈ సిరీస్‌తో పాటు శ్రీలంక సిరీస్‌కు కూడా అతడికి జట్టులో అవకాశమిచ్చాం. అదే విధంగా సిరాజ్‌ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. కేవలం వన్డే క్రికెట్‌లోనే కాకుండా రెడ్‌బాల్‌, టీ20 ఫార్మాట్లలో కూడా సిరాజ్‌ అదరగొడుతున్నాడు అని హిట్‌మ్యాన్‌ అన్నాడు.
చదవండి: IND vs NZ: బ్రెస్‌వెల్‌ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో తొలి ఆటగాడిగా

మరిన్ని వార్తలు