IND VS ENG:ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌పై రోహిత్‌ శర్మ సంచలన వ్యాఖ్యలు

4 Oct, 2021 19:44 IST|Sakshi

దుబాయ్‌: ఇంగ్లండ్‌తో ఇటీవల ముగిసిన టెస్ట్‌ సిరీస్‌పై టీమిండయా స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2-1తేడాతో టీమిండియా సిరీస్‌ గెలిచిందని వివాదాస్పద స్టేట్‌మెంట్‌ చేశాడు. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన రసవత్తర సిరీస్‌లో టీమిండియానే అసలైన విజేత అని పేర్కొని వివాదానికి తెరలేపాడు. తుది ఫలితం వెలువడకుండానే టీమిండియాను విజేతగా పేర్కొనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ), బీసీసీఐ, ఐసీసీ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయంపై రోహిత్‌ ఎలా ప్రకటన చేస్తాడంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  

కాగా, 5 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన ఆఖరి మ్యాచ్‌ కరోనా కారణంగా అర్ధాంతరంగా రద్దైన సంగతి తెలిసిందే. చివరి టెస్ట్‌కు కొద్ది గంటల ముందు భారత బృందంలో కరోనా కేసు బయటపడడంతో టీమిండియా ఆటగాళ్లు బరిలోకి దిగేందుకు నిరాకరించారు. నాలుగు టెస్ట్‌లు ముగిసే స‌మ‌యానికి టీమిండియా 2-1 లీడ్‌లో ఉంది. రద్దైన ఆఖరి టెస్ట్‌ను వచ్చే ఏడాది టీమిండియా.. ఇంగ్లండ్‌ పర్యటనలో షెడ్యూల్‌ చేసేందుకు ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు సూచనప్రాయంగా అంగీకారం తెలిపాయి. 

అయితే,  ఆ మ్యాచ్‌ స్టాండ్‌ అలోన్‌ టెస్ట్‌గా జరుగుతుందా లేక 5టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతుందా అన్న‌ విషయంపై ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. ఈ నేపథ్యంలో రోహిత్ శ‌ర్మ సంచలన స్టేట్‌మెంట్‌ చేయడం చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రోహిత్‌ శర్మ అద్భుతంగా రాణించాడు. 4 మ్యాచ్‌ల్లో  52.57 స‌గ‌టుతో 368 పరుగులు చేసి టీమిండియా తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 
చదవండి: వార్నర్‌ను పక్కకు పెట్టడానికి క్రికెటేతర కారణాలు ఉన్నాయి..!

మరిన్ని వార్తలు