ఓపెనర్‌గానే రోహిత్‌ శర్మ!

6 Jan, 2021 00:06 IST|Sakshi

మయాంక్‌ బెంచ్‌కే పరిమితం

ఉమేశ్‌ స్థానంలో శార్దుల్‌ లేదంటే సైనీ

తుది కసరత్తులో టీమిండియా

సిడ్నీలో రేపటి నుంచి మూడో టెస్టు

సిడ్నీ: ఫిట్‌నెస్‌ సంతరించుకొని... క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తుదిజట్టులో స్థానం ఖరారైంది. సిడ్నీలో గురువారం మొదలయ్యే మూడో టెస్టులో రోహిత్‌ ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం ఖాయమైంది. ఆతిథ్య బౌలర్లను ఎదుర్కోవడంలో తంటాలు పడుతున్న మయాంక్‌ అగర్వాల్‌ను సిడ్నీ టెస్టు నుంచి తప్పించాలని టీమిండియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టాపార్డర్‌లోనే ‘హిట్‌మ్యాన్‌’ దిగనుండటంతో ఇప్పుడు ఆంధ్ర క్రికెటర్‌ హనుమ విహారి స్థానానికి వచ్చిన ముప్పేమీ లేదు. గాయంతో సిరీస్‌ నుంచి వైదొలిగిన పేస్‌ బౌలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ స్థానంలో శార్దుల్‌ ఠాకూర్, నవదీప్‌ సైనీ, నటరాజన్‌లలో ఒకరికి చాన్స్‌ దక్కుతుంది.

టీమ్‌ మేనేజ్‌మెంట్‌ జట్టు కూర్పు కోసం తుది కసరత్తు చేస్తోంది. తాత్కాలిక సారథి రహానే ప్రధానంగా బ్యాటింగ్, బౌలింగ్‌ల సమతూకంపై దృష్టి పెట్టాడు. ప్రధానంగా సీనియర్‌ సీమర్లు లేని బౌలింగ్‌ లైనప్‌పై అతను సమాలోచనలు చేస్తున్నాడు. ఇదివరకే షమీ దూరమయ్యాడు. ఇప్పుడేమో ఉమేశ్‌ లేడు. ఇలాంటి పరిస్థితుల్లో బుమ్రా, సిరాజ్‌లకు తోడుగా తుది జట్టులో మూడో పేసర్‌గా శార్దుల్, సైనీ, కొత్త పేసర్‌ నటరాజన్‌లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తర్జనభర్జన పడుతోంది. వాతావరణం మేఘావృతమై ఉండటంతో పిచ్‌పై కవర్‌ని కప్పి ఉంచారు. బహుశా పిచ్‌ పరిశీలించాకే మూడో పేసర్‌ ఎవరో ఖరారు చేసే అవకాశముంది. మంగళవారం జరిగిన నెట్‌ సెషన్‌లో రోహిత్‌ ప్రాక్టీస్‌ చేశాడు. అతను పేసర్లు, స్పిన్నర్లను ఇబ్బంది లేకుండా ఎదుర్కొన్నాడు.

గాయంతో స్వదేశానికి రాహుల్‌ 
ఈ సిరీస్‌లో గాయాలు... ఇరు జట్ల ఆటగాళ్లతో ఆడుకుంటున్నాయి. భారత శిబిరంలో ఇప్పటికే సీనియర్‌ సీమర్లు షమీ, ఉమేశ్‌ యాదవ్‌లు టెస్టు సిరీస్‌కు దూరం కాగా, ఈ జాబితాలో ఇప్పుడు బ్యాట్స్‌మన్‌ లోకేశ్‌ రాహుల్‌ కూడా చేరాడు.  ప్రాక్టీస్‌ సెషన్‌లో అతని ఎడంచేతి మణికట్టు బెణికింది. గాయం తీవ్రత దృష్ట్యా అతను మిగతా రెండు టెస్టులకు అందుబాటులో ఉండడని జట్టు వర్గాలు తెలిపాయి. ‘శనివారం మెల్‌బోర్న్‌లో బ్యాటింగ్‌ సాధన చేస్తుండగా రాహుల్‌ ఎడంచేతి మణికట్టు బెణికింది. అతను పూర్తిగా కోలుకునేందుకు సుమారు మూడు వారాల సమయం పడుతుంది. అందువల్లే మిగతా మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు’ అని బీసీసీఐ తెలిపింది. మంగళవారం అతను స్వదేశానికి పయనమయ్యాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో అతనిప్పుడు పునరావాస శిబిరంలో పాల్గొంటాడు. కాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌ తో జరిగే సిరీస్‌కల్లా రాహుల్‌ కోలుకుంటాడా లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. 

వార్నర్‌ రెడీ! 
ఆస్ట్రేలియా డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ సిడ్నీ టెస్టుకు సిద్ధమయ్యాడని జట్టు కోచ్‌ లాంగర్‌ చెప్పుకొచ్చాడు. గజ్జల్లో గాయంతో టి20లతో పాటు అతను తొలి రెండు టెస్టులకు దూరమైన సంగతి తెలిసిందే. అతని ఫిట్‌నెస్‌పై కోచ్‌... మీడియాతో వర్చువల్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ ‘వార్నర్‌ ఆడతాడని చాలా ఆశాభావంతో ఉన్నాం. ఎంతైనా అతను యోధుడు కదా! ఎందుకంటే జట్టు కోసం సంసిద్ధంగా ఉండేందుకు అతను ఏదైనా చేస్తా డని మొదటినుంచి నేను చెబుతున్నా. అన్నట్లే అతను ట్రాక్‌లో పడ్డాడు. టచ్‌లోకి వచ్చాడు. ఆడేందుకు అంకితభావంతో కృషిచేశాడు. ఈ పోటాపోటీ టెస్టు సిరీస్‌లో పాల్గొనేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. నెట్‌ సెషన్స్‌ పూర్తయ్యాక అతనిపై తుది నిర్ణ యం తీసుకుంటాం. తొందరపడి అతన్ని రిస్క్‌లోకి నెట్టం. అంతా ఆలోచించే జట్టును ఖరారు చేస్తాం’ అని అన్నాడు. భారత్‌ ‘ఎ’తో జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో తలకు బంతి తగిలి కన్‌కషన్‌కు గురైన యువ బ్యాట్స్‌మన్‌ పకోవ్‌స్కీ కూడా కోలుకున్నాడని కోచ్‌ చెప్పా డు. దీంతో టెస్టుల్లో పకోవ్‌స్కీ అరంగేట్రం చేయనున్నాడు.

మరిన్ని వార్తలు