Rohit Sharma: ఒకప్పుడు జట్టులో చోటే దక్కలేదు.. ఇప్పుడు ఏకంగా కెప్టెన్‌.. త్వరలోనే టెస్టులకు కూడా!

9 Dec, 2021 17:08 IST|Sakshi

Rohit Sharma: From Not Being Part Of Squad To Limited Overs Captain Journey: రోహిత్‌ శర్మ... హిట్‌మ్యాన్‌ అని అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు.. ఇప్పటి వరకు రోహిత్‌ శర్మ కెరీర్‌ను పరిశీలిస్తే.. మూడు భాగాలుగా విభజించవచ్చు... ఆరంభంలో జట్టులో చోటు దక్కడమే గగనంగా మారిన వేళ.. ఒక్కొక్కటిగా సమస్యలు అధిగమిస్తూ... ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు ఏకంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. 

2007లో అడుగుపెట్టాడు...
రోహిత్‌ శర్మ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆరేళ్ల వరకు పెద్దగా ఆకట్టులేకపోయాడు. 80 మ్యాచ్‌లలో కలిపి కనీసం 2000 పరుగులు సాధించలేకపోయాడు. ఇక శ్రీలంకతో 2012లో జరిగిన ఒకానొక సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లలో కలిపి రోహిత్‌ శర్మ చేసిన మొత్తం పరుగులు 13. దీంతో రోహిత్‌ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. జట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది. ముఖ్యంగా 2011 వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం దక్కకపోవడంతో నిరాశకు లోనయ్యాడు రోహిత్‌. అలాంటి సమయంలో ధోని నిర్ణయం రోహిత్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది.

విధ్వంసకర ఓపెనర్‌.. పరుగుల ప్రవాహం..
2013లో అప్పటి కెప్టెన్‌ ధోని.. రోహిత్‌ శర్మను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేశాడు. శిఖర్‌ ధావన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసిన రోహిత్‌... టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత హిట్‌మ్యాన్‌కు వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

విధ్వంసకర ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్‌... ఆస్ట్రేలియా మీద డబుల్‌ సెంచరీ సాధించి వన్డేల్లో ఈ రికార్డు నమోదు చేసిన మూడో ఆటగాడిగా చరిత్ర లిఖించాడు. అంతేకాదు... మూడు సార్లు ఈ ఫీట్‌ సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా హిట్‌మ్యాన్‌దే(264). ఇక బ్యాటర్‌గా రోహిత్‌ శర్మ సాధించిన రికార్డులన్నింటి గురించి ప్రస్తావించాలంటే పదాలు సరిపోవంటే అతిశయోక్తి కాదు!

టీమిండియాకు కొత్త రారాజు..
విరాట్‌ కోహ్లి గైర్హాజరీలో పలు మ్యాచ్‌లలో టీమిండియా సారథ్య బాధ్యతలు నిర్వహించిన రోహిత్‌ శర్మ... టీ20 వరల్డ్‌కప్‌-2021 ముగిసిన తర్వాత పొట్టి ఫార్మాట్‌ సారథిగా ఎంపికయ్యాడు. ఇక వన్డేల్లోనూ సారథిగా తన నియామకం ఖాయమేనన్న విశ్లేషణల నేపథ్యంలో దక్షిణాఫ్రికా టూర్‌కు ముందు బీసీసీఐ ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో..  ‘‘భారత క్రికెట్‌కు కొత్త రాజు వచ్చేశాడు.. ఇక వెనుదిరిగి చూసేది లేదు’’అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైట్‌ బాల్‌ క్రికెట్‌ కెప్టెన్సీకి హిట్‌మ్యాన్‌ వందకు వంద శాతం అర్హుడు అని కామెంట్లు చేస్తున్నారు. 

కాగా స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేయడంతో కెప్టెన్‌గా రోహిత్‌ ఖాతాలో తొలి సిరీస్‌ విజయం నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడు వన్డేల నిమిత్తం సౌతాఫ్రికా వెళ్తున్న తరుణంలో అక్కడ కూడా వైట్‌వాష్‌ చేసి సత్తా చాటాలని ఫ్యాన్స్‌ ఆకాంక్షిస్తున్నారు. అవును మరి... ఒకప్పుడు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కకపోవడంతో నిరాశ చెందిన రోహిత్‌.. రానున్న వరల్డ్‌కప్‌లో భారత సారథిగా వ్యవహరించనుండటం నిజంగా విశేషమే. ఇదిలా ఉంటే.. టెస్టు వైస్‌ కెప్టెన్‌గా కూడా రోహిత్‌కు ప్రమోషన్‌ దక్కిన నేపథ్యంలో త్వరలోనే ఆ ఫార్మాట్‌లో కూడా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 

చదవండి: ODI Captaincy- Virat Kohli: అందుకే కోహ్లిపై వేటు వేశారు!.. మరీ ఇంత అవమానకరంగా.. ఇక టెస్టు కెప్టెన్సీకి కూడా..

మరిన్ని వార్తలు