Ind Vs Eng 5th Test: రోహిత్‌ ఆడతాడా...లేదా? కోవిడ్‌ నుంచి కోలుకోని భారత కెప్టెన్‌..!

30 Jun, 2022 07:10 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో కీలక టెస్టుకు ముందు భారత్‌కు ఎదురు దెబ్బ! కరోనా బారిన పడిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మ్యాచ్‌ ప్రారంభమయ్యే జులై 1లోగా కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. కోవిడ్‌ బారినపడి ఐసోలేషన్‌లో ఉన్న రోహిత్‌కు బుధవారం జరిపిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో కూడా “పాజిటివ్‌’ వచ్చింది. దాంతో అతని ఐసోలేషన్‌ కొనసాగనుంది. గురువారం కూడా రోహిత్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తర్వాతే అతను ఆడతాడా లేదా అనేదానిపై తుది నిర్ణయం తీసుకుంటామని హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. బుధవారం బర్మింగ్‌హామ్‌లో భారత జట్టు ప్రాక్టీస్‌లో పాల్గొనగా, రోహిత్‌ కనిపించకపోవడంతోనే సందేహం మొదలైంది.

‘రోహిత్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నాం. అతను మ్యాచ్‌కు దూరమయ్యాడని ఇప్పుడే చెప్పలేను. కానీ ముందుగా పరీక్షలో నెగెటివ్‌గా రావడం కూడా ముఖ్యం కదా. రోహిత్‌ ఆడకపోతే కొత్త కెప్టెన్‌ ఎవరనే విషయం కూడా ఆ తర్వాతే చెబుతాం’ అని ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. అయితే తాజా పరిస్థితిని బట్టి చూస్తే టెస్టు మ్యాచ్‌లో రోహిత్‌ ఆడే అవకాశం లేదని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. గత ఏడాది కోవిడ్‌ కారణంగా చివరి టెస్టు అనూహ్యంగా వాయిదా పడే సమయానికి భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ముందంజలో ఉంది. ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత సెంచరీతో భారత్‌ను గెలిపించిన రోహిత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. ఇప్పుడు కెప్టెన్‌గా బరిలోకి దిగాల్సిన స్థితిలో అతడికి కరోనా అడ్డంకిగా మారింది. 
కెప్టెన్‌గా బుమ్రా!
రోహిత్‌ లేకపోతే బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయం. ఈ సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేయకపోయినా, స్వదేశంలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో బుమ్రా వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. బుమ్రా ఏ స్థాయిలోనూ ఏ జట్టుకూ ఇప్పటి వరకు కెప్టెన్‌గా పని చేయలేదు. ఒకవేళ అతనికి సారథ్యం అప్పగిస్తే కపిల్‌దేవ్‌ తర్వాత భారత కెప్టెన్సీ అవకాశం అందుకున్న మొదటి పేస్‌ బౌలర్‌గా బుమ్రా నిలుస్తాడు. 
చదవండి: Ind Vs Eng 5th Test: టీమిండియాతో ఐదో టెస్టు.. జట్టును ప్రకటించిన ఇంగ్లండ్‌..!

మరిన్ని వార్తలు