టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియాలో భారీ మార్పులు..?

13 Sep, 2021 10:05 IST|Sakshi

న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తప్పుకోనున్నాడా అంటే అవుననే అంటున్నాయి పలు నివేదికలు. గత కొద్ది రోజులుగా టీమిండియా కెప్టెన్సీపై రకరకాలు ఊహాగానాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో తాజాగా వెలువడుతున్న ఓ వార్త భారత క్రికెట్‌లో దుమారం రేపుతోంది. అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకోనున్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరగుతుంది.

ఈ విషయమై ఏకీభవిస్తూ జాతీయ మీడియా సైతం కథనాలను ప్రచారం చేస్తోంది. కోహ్లినే స్వయంగా ఈ ప్రతిపాదనను బీసీసీఐ పెద్దల ముందుంచినట్లు తెలుస్తోంది. మూడు ఫార్మాట్లలో సారధ్య బాధ్యతలు బ్యాటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని కోహ్లినే స్వయంగా ఈ మేరకు నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. పరిమిత ఓవర్ల సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక టెస్ట్‌ కెప్టెన్సీపై పూర్తి ఫోకస్‌ ఉంచాలని కోహ్లి భావిస్తున్నట్లు అతని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా మంచి ట్రాక్‌ రికార్డు కలిగిన రోహిత్‌ శర్మకు టీమిండియా పరిమిత ఓవర్ల పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ప్రచారం​ జరుగుతోంది. రోహిత్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పేందుకు కోహ్లి సైతం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ సారధిగా వ్యవహరిస్తున్న రోహిత్‌ శర్మ ఇదివరకే 5 సార్లు తన జట్టును ఛాంపియన్‌గా నిలపడంలో సఫలమయ్యాడు. ఇదే ట్రాక్‌ రికార్డును పరిగణలోకి తీసుకుని బీసీసీఐ రోహిత్‌కు పగ్గాలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. 
చదవండి: పాక్‌ను వెనక్కు నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా..

>
మరిన్ని వార్తలు