ధోనితో పోలికపై రోహిత్‌ స్పందన

3 Aug, 2020 10:59 IST|Sakshi

ముంబై: టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మను ఎంఎస్‌ ధోనితో పోల్చుతూ సురేశ్‌ రైనా కామెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘ భారత క్రికెట్‌ జట్టులో తదుపరి ‘ఎంఎస్‌ ధోని’ ఎవరైనా ఉంటే అది రోహిత్‌ శర్మనే. ధోనిలోని వ్యక్తిత్వం, నడవడిక, అవతలి  వాళ్లు చెప్పేది వినేతత్వం, ఆత్మవిశ్వాసం, జట్టును ముందుండి నడిపించే తీరు అన్నీ రోహిత్‌లో ఉన్నాయి. డ్రెస్పింగ్‌ వాతావరణాన్ని కూడా రోహిత్‌ ఎంతగానో గౌరవిస్తాడు. ఇక్కడ రోహిత్‌లో నాకు ధోనినే కనబడుతున్నాడు. అందుకే రోహిత్‌ను నెక్స్ట్‌ ధోని అంటున్నా’ అని రైనా పేర్కొన్నాడు. కాగా, దీనిపై రోహిత్‌ శర్మ స్పందించాడు. (నా గులాబీకి గులాబీలు: హార్దిక్‌)

తన ట్వీటర్‌ అకౌంట్‌లో రోహిత్‌ ఒక వీడియోలో మాట్లాడుతూ..‘ అవును.. నేను సురేశ్‌ రైనా కామెంట్స్‌ విన్నాను. నన్ను ధోనితో పోల్చాడు. ఎంఎస్‌ ధోనికి కొన్ని లక్షణాలు ఉంటుంది. ప్రతీ మనిషి యొక్క గుణగణాలు సెపరేట్‌గా ఉంటాయి. అలానే ప్రతీ ఒక్కరికి ఒక్కో లక్షణం, ఒక్కో వ్యక్తిత్వం ఉంటాయి. రైనా చేసిన పోలిక సరైనది కాదని నేను నమ్ముతున్నాను. నేను ఎప్పుడూ పోలికల్ని ఇష్టపడను. ప్రతీ ఒక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది.. అలానే బలాలు, బలహీనతలు కూడా ఉంటాయి’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. 

కాగా, ఐపీఎల్‌ మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ కెప్టెన్‌ ఎవరైనా ఉ‍న్నారంటే అది రోహిత్‌ శర్మనే. నాలుగుసార్లు టైటిల్స్‌ గెలిచి రికార్డు సాధించాడు. ఇక్కడ ధోని కంటే రోహిత్‌ ఒక టైటిల్‌ అధికంగానే గెలిచాడు. గతేడాది జరిగిన ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)ను ఓడించి నాల్గోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇక టీమిండియాకు పలుమార్లు రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెగ్యులర్‌ కెప్టెన్లు గైర్హాజరీ అయిన క్రమంలో రోహిత్‌ కెప్టెన్‌గా వ్యహరించాడు. ఇక్కడ రోహిత్‌ విజయాల శాతం 80 శాతం ఉంది. రోహిత్‌ తన కెప్టెన్సీలో భారత్‌కు ఎనిమిది విజయాలు అందించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో క్రికెట్‌ ప్రేమికులు ఊపిరిపీల్చుకున్నారు. వచ్చే నెల 19వ తేదీ నుంచి నవంబర్‌ 10 వరకూ ఐపీఎల్‌-13 సీజన్‌ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. (వద్దు సార్‌.. జట్టును నాశనం చేస్తాడు!)

మరిన్ని వార్తలు