Rohit Sharma: 'మ్యాచ్‌ హీరో అర్ష్‌దీప్‌.. బుమ్రా లోటును తీరుస్తున్నాడు'

2 Nov, 2022 21:56 IST|Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం టీమిండియా బంగ్లాదేశ్‌పై ఐదు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో టీమిండియా సెమీస్‌ బెర్తును దాదాపు ఖరారు చేసుకున్నట్లే. ఇక మ్యాచ్‌ ముగిసిన అనంతరం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడాడు.

''ఒక పక్క ఒత్తిడి.. మరోపక్క సంతోషం రెండింటిని బ్యాలెన్స్‌ చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌ చేతిలో 10 వికెట్లు ఉన్న సమయంలో కాస్త భయమేసింది. వర్షం అడ్డుపడడంతో ఇక మా పని అయిపోందనుకున్నా. కానీ వర్షం తర్వాత ప్రారంభమైన ఆటలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ముఖ్యంగా మ్యాచ్‌లో హీరో అర్ష్‌దీప్‌ సింగ్‌. ఒత్తిడిలో బౌలింగ్‌ చేయడం సవాల్‌. డెత్‌ ఓవర్లలో బుమ్రా లేని లోటు తెలియకుండా అర్ష్‌దీప్‌ రాణించడం మాకు ప్రత్యేకం.

ఆసియా కప్‌ నుంచి అర్ష్‌దీప్‌లో మంచి పరిణితి కనిపిస్తుంది. దీని వెనుక తొమ్మిది నెలల కఠోర శ్రమ దాగుంది. ఇక కేఎల్‌ రాహుల్‌ ఫామ్‌లోకి రావడం ఉత్తమం. అతని బ్యాటింగ్‌పై జట్టు ఎప్పుడు నమ్మకం కోల్పోలేదు. ఇక కోహ్లి గురించి చెప్పడానికి ఏం లేదు. టి20 ప్రపంచకప్‌ కొట్టడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడా అని అనిపిస్తుంది. అతను ఫామ్‌లో ఉంటే ఆపడం కష్టం.. ఇది ఇలాగే కొనసాగాలి. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో ఫేలవ ఫీల్డింగ్‌ మా కొంపముంచింది. కానీ ఇవాళ అదే ఫీల్డింగ్‌ మమ్మల్ని కాపాడింది. బంగ్లాదేశ్‌ జట్టు చాలా బాగా పోరాడింది. కానీ అంతిమంగా విజయం ఒకరినే వరిస్తుంది.'' అంటూ ముగించాడు.

చదవండి: ఆసక్తికరంగా గ్రూప్-2 సెమీస్‌ బెర్తు.. 

మరిన్ని వార్తలు