ఎన్ని బంతులు ఆడానన్నదే ముఖ్యం...

11 Mar, 2021 08:06 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో రాణించిన భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో భారత టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. తన శైలికి భిన్నంగా క్రీజ్‌లో ఎక్కువ సేపు నిలబడి పరుగులు చేసేందుకు ప్రయత్నించానని, అది తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని రోహిత్‌ అన్నాడు. ఇప్పుడు పరుగులకంటే ఎక్కువ బంతులు ఆడగలగడమే తనకు సంతృప్తినిస్తోందని అతను చెప్పాడు.

‘మనకు అలవాటు లేని పనులు సమర్థంగా చేయగలిగితే అదే ఒక చిన్నపాటి విజయంలాగా అనిపిస్తుంది. గత రెండు టెస్టు సిరీస్‌ల్లో నా బ్యాటింగ్‌ చాలా సంతృప్తినిచ్చింది. చివరి టెస్టులో 49 పరుగులే చేసినా 150 బంతులు ఆడాను.అంటే నా సహజ శైలికి భిన్నంగా సుదీర్ఘ సమయం పాటు క్రీజ్‌లో నిలవగలిగాను. ఇక షాట్లు ఆడాలని అనిపించినప్పుడల్లా నన్ను నేను నియంత్రించుకోగలిగా. ఒక్క తప్పుడు షాట్‌ కూడా ఆడకుండా క్రమశిక్షణతో బ్యాటింగ్‌ చేశా. అందుకే ఆ 49 పరుగులు సంతృప్తినిచ్చాయి. ఇప్పుడు నాకు టెస్టుల్లో సవాల్‌ ఎన్ని పరుగులు చేశానన్నది కాదు. ఎన్ని బంతులు ఆడానన్నదే ముఖ్యం. 100, 150, 200...ఇలా ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే సహజంగానే ఆపై పరుగులు వస్తాయి’ అని రోహిత్‌ వ్యాఖ్యానించాడు.
చదవండి: 
'అరె పంత్‌.. బెయిల్‌ నీ గ్లోవ్స్‌లోనే ఉంది'

మరిన్ని వార్తలు