Asia Cup 2022 - Ind Vs Pak: పంత్‌పై కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ.. ఎందుకంటే..?

5 Sep, 2022 11:52 IST|Sakshi

ఆసియాకప్‌-2022లో భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. ఈ మెగా ఈవెంట్‌ సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పాక్‌ బ్యాటర్లలో మహ్మద్‌ రిజ్వాన్‌(71) పరుగులతో మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కాగా బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్‌.. బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమయ్యంది.

కాగా తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లి(60) అర్ధసెంచరీతో చేలరేగగా.. రోహిత్‌ శర్మ(28), కేఎల్‌ రాహుల్‌ (28) పరుగులతో రాణించారు. అయితే ఈ మ్యాచ్‌లో వికెట్‌ కీపర్‌ పం‍త్‌, హార్ధిక్‌ పాండ్యా తీవ్రంగా నిరాశ పరిచారు. కాగా కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన రిషబ్‌ పంత్‌.. నిర్లక్షమైన షాట్‌ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు.

భారత్‌ ఇన్నింగ్స్‌ 14 ఓవర్‌ వేసిన షాదాబ్‌ ఖాన్‌ బౌలింగ్‌లో.. ఐదో బంతికి రివర్స్‌ స్వీప్‌ షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే షాట్‌ సరిగ్గా కనెక్ట్‌ కాకపోవడంతో బంతి నేరుగా పాయింట్‌ ఫీల్డర్‌ చేతికి వెళ్లింది. దీంతో పంత్‌ పెవిలియన్‌కు చేరాడు. కాగా ఓ వైపు వికెట్లు కోల్పోతున్న క్రమంలో పంత్‌ ఆ షాట్‌ ఆడాల్సిన అవసరం లేదు.

ఈ నేపథ్యంలో నిర్లక్షమైన షాట్‌ ఆడి పెవిలియన్‌కు చేరిన పంత్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకు అటువంటి షాట్‌ ఆడావు అంటూ పంత్‌పై హిట్‌మ్యాన్‌ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో దినేష్‌ కార్తీక్‌కు పక్కన పెట్టి మరీ పంత్‌ను తీసుకున్నారు.

చదవండి: Virat Kohli: ధోని తప్ప ఒక్కరూ మెసేజ్‌ చేయలేదు.. టీవీలో వాగినంత మాత్రాన: కోహ్లి ఘాటు వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు