రోహిత్‌ కావాలనే అలా చేశాడా!

18 Jan, 2021 16:31 IST|Sakshi

బ్రిస్బేన్‌: సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ రిషబ్‌పంత్‌ గార్డ్‌మార్క్‌ను చెరిపేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. స్మిత్‌ చేసిన పనిపై తీవ్ర విమర్శలు వచ్చినా ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌, కోచ్‌ లాంగర్‌ సహా ఇతర ఆటగాళ్లు స్మిత్‌ చేసింది తప్పు కాదంటూ సమర్థించుకోవడం విశేషం. తాజాగా బ్రిస్బేన్ టెస్ట్‌లో టీమిండియా ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ స్మిత్‌ను అనుకరించాడు. ఆసీసీ బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఓవర్‌ ముగియడంతో స్మిత్‌ లబుషేన్‌తో చర్చిస్తున్నాడు. ఇంతలో క్రీజులోకి వచ్చిన రోహిత్‌ శర్మ స్మిత్‌ చూస్తుండ‌గానే షాడో బ్యాటింగ్ చేశాడు. అయితే స్మిత్ లాగా అతని బ్యాటింగ్ గార్డ్‌ను మాత్రం చెరిపేయ‌లేదు. రోహిత్ కావాల‌నే స్మిత్ ముందు అలా చేసినట్లు వీడియోలో తెలుస్తుంది. అయితే స్మిత్‌ మాత్రం రోహిత్‌ టీజ్‌ చేస్తున్నట్లుగా గ్రహించి వెంటనే తల కిందకు తిప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదే స‌మ‌యంలో కామెంట‌రీ బాక్స్‌లో ఉన్న సంజ‌య్ మంజ్రేక‌ర్ మాత్రం.. అప్పుడు స్మిత్ చేసింది త‌ప్ప‌యితే.. ఇది కూడా త‌ప్పే అనడం విశేషం.(చదవండి:ఈ రికార్డులు చూస్తే తెలుస్తుంది గబ్బా కథ!)

ఈ టెస్టు సిరీస్ ఆరంభం నుంచి భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్ల మధ్య స్లెడ్జింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టులో స్వయానా ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కూడా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ను టార్గెట్‌ చేస్తూ స్లెడ్జింగ్‌కు దిగడం పెద్ద వివాదాస్పదమయింది. దీనిపై పైన్‌ క్షమాపణ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. కాగా నాలుగో టెస్టులో ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ ముందు 326 లక్ష్యం నిలిచింది. కాగా ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్‌ కోల్పోకుండా నాలుగు పరుగులు చేసింది. రోహిత్‌ 4, గిల్‌ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మరిన్ని వార్తలు