వాళ్లు ఆలోచించరు.. మాకు అవసరమా: రోహిత్‌

21 Feb, 2021 20:50 IST|Sakshi

అహ్మదాబాద్‌: భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పిచ్‌లను టీమిండియా తమకు అనూకూలంగా మార్చుకుందంటూ వస్తున్న విమర్శలను టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఖండించాడు. రోహిత్‌ వీడియోనూ బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ' పిచ్‌ అనేది ఇరు జట్లకు సమానంగానే ఉంటుంది. ఇప్పుడు కాదు కొన్ని సంవత్సాలు నుంచే టీమిండియాలో అన్ని పిచ్‌లను ఒకేరకంగా తయారు చేస్తున్నారు. భారత్‌లో ఇంతకముందు జరిగిన టెస్టు సిరీస్‌లు కూడా ఇవే పిచ్‌లపై జరిగాయి. అప్పుడు రాని చర్చలు ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి.. దీనిపై ఇంత డిబేట్‌ ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. పిచ్‌లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటుందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అయినా ఏ జట్టైనా తమ సొంత గ్రౌండ్‌లు తమకే అనుకూలంగా ఉండాలని భావిస్తాయి.

ఇదే పరిస్థితి మాకు బయట ఎదురవుతుంది. మేం ఇటీవలే ఆసీస్‌ పర్యటనకు వెళ్లి వచ్చాం. మరి ఆసీస్‌ జట్టు వారి సొంతగడ్డపై ఉన్న మైదానాలకు అనుకూలంగా తయారుచేసుకోలేదా.. మేం వారితో పోరాడి సిరీస్‌ గెలవలేదా? మేం బయటికి వెళ్లి ఆడినప్పుడు వారు మా గురించి పట్టించుకోరు.. ఇప్పుడు అంతే.. వేరే జట్టు మన దేశానికి వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకుంటాం. హోం అడ్వాంటేజ్‌ అనే పదం వినిపించకూడదంటే ఇకపై అవన్నీ తీసేసి ఆడితే బాగుంటుంది. దీనిపై ఐసీసీతో చర్చించండి.. ఆ రూల్‌ వచ్చేలా చేయండి. ఇంతటితో దీనికి విరామిస్తే బాగుంటుంది. అయినా పిచ్‌పై అనవసర చర్చను పక్కనపెట్టి మ్యాచ్‌లు, ఆటగాళ్ల ప్రదర్శన గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది.' అని చెప్పుకొచ్చాడు.

కాగా రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. రవిచంద్రన్‌ అశ్విన్‌ సెంచరీతో పాటు బౌలింగ్‌లోనూ 9వికెట్లు తీసి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలిపించాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. కాగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు అహ్మదాబాద్‌ వేదికగా ఫిబ్రవరి 24వ తేదీన జరగనుంది.
చదవండి: అశ్విన్‌‌ అవసరం తీరిపోయింది.. కమ్‌బ్యాక్‌ కష్టమే

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు