కోహ్లి సహా ఏ ఒక్కరిని వదిలిపెట్టని రోహిత్‌ శర్మ..

8 Mar, 2023 20:00 IST|Sakshi

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీమిండియా ఆటగాళ్ల నుంచి సిబ్బంది వరకు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. అందరిని ఒక రౌండ్‌ వేసుకున్నాడు.  కొంపదీసి రోహిత్‌ టీమిండియా ఆటగాళ్లను ఏమైనా తిట్టాడా ఏంటి అనుకుంటున్నారా. అదేం కాదులెండి.. పైన చెప్పుకున్నదంతా హోలీ సెలబ్రేషన్స్‌ గురించి. విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ఆడేందుకు టీమిండియా మంగళవారం అహ్మదాబాద్‌కు చేరుకుంది.

మంగళవారం కోహ్లి, రోహిత్‌ సహా పలువురు క్రికెటర్లు రన్నింగ్‌ బస్‌లోనే హోలీ వేడుకలు జరుపుకున్నారు.  తాజాగా బుధవారం అహ్మదాబాద్‌లో రోహిత్‌ ఒక్కడే హోలీ సెలబ్రేట్‌ చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు సహా స్టాఫ్‌ సిబ్బందికి రంగులు పూసి సెలబ్రేట్‌ చేశాడు. ఈ సందర్భంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టని రోహిత్‌ సూర్యకుమార్‌, ఇషాన్‌ కిషన్‌లకు రంగులు కాస్త ఎక్కువగానే పూశాడు.

తొలుత కోహ్లి ఎక్కడా కనిపించలేదు.. అరె కోహ్లి తప్పించుకున్నాడుగా అని మనం అనుకునేలోపే బస్సెక్కిన రోహిత్‌ కంట పడ్డాడు కోహ్లి. అంతే పరుగున కోహ్లి వద్దకు వెళ్లిన రోహిత్‌ ముఖానికి రంగులు పూశాడు. ఆ తర్వాత అంతా కలిసి మరోసారి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి(గురువారం) జరగనున్న నాలుగో టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ ఓడినా.. డ్రా చేసుకున్న ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియగా.. తొలి రెండు టీమిండియా గెలవగా.. ఇండోర్‌ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 

చదవండి: Pele: ఆస్తుల పంపకం.. 30 శాతం మూడో భార్యకు; 70 శాతం పిల్లలకు

మరిన్ని వార్తలు