Max Verstappen: ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టేశాడు; ఇది అతి పెద్ద తప్పిదం!

13 Dec, 2021 09:09 IST|Sakshi

Rohit Sharma & Usman Khawaja React On Verstappen Win: గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కూడా ఉంటేనే నిర్దేశించుకున్న లక్ష్యాలు పూర్తి చేయవచ్చంటారు... రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌కు ఈ మాటలు చక్కగా సరిపోతాయి. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్ లూయీస్‌ హామిల్టన్‌ను ఓడించి తొలిసారి ఫార్ములావన్‌ (ఎఫ్‌ 1) ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు వెర్‌స్టాపెన్‌. తన చిరకాల కలను ఎట్టకేలకు నెరవేర్చుకున్నాడు. గెలవగానే.. ‘‘నిజంగా.. ఇది నా అదృష్టమనే చెప్పాలి’’ అని వ్యాఖ్యానించాడు.

ఈ క్రమంలో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు విజేతను నిర్ణయించిన తీరుపై నిర్వాహకులపై విమర్శలు కూడా వస్తున్నాయి. రేసు చివర్లో సేఫ్టీ కారు విషయంలో రేసు డైరెక్టర్‌ తీసుకున్న నిర్ణయాలపై మెర్సిడెస్‌ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వెర్‌స్టాపెన్‌ గెలిచేలా సేఫ్టీ కారు నిర్ణయాలు తీసుకుందంటూ ఆరోపించడం చర్చనీయాంశమైంది.  

ఈ నేపథ్యంలో.. అబుదాబి గ్రాండ్‌ప్రి రేసులో వెర్‌స్టాపెన్‌ విజయంపై పలువురు క్రికెటర్లు తమదైన శైలిలో స్పందించారు. కొంతమంది అతడిని అభినందిస్తే.. మరికొంతమంది మాత్రం మెర్సిడెస్‌కు వత్తాసు పలికారు.

ఎవరెవరు ఏమన్నారంటే..
ఆఖరి బాల్‌.. సిక్స్‌ కొట్టేశాడు...
‘‘ఒక్క బాల్‌ సిక్సర్‌ కొట్లాలి.. ఏం జరిగిందో ఊహించండి.. మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ సిక్స్‌ కొట్టేశాడు. నమ్మశక్యం కాని విజయం ఇది. అబుదాబి గ్రాండిప్రి.. కొత్త చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌’’ అని టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వెర్‌స్టాపెన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.

అతిపెద్ద తప్పిదం ఇది..
‘‘ఎఫ్‌ 1 చరిత్రలో అతిపెద్ద తప్పిదం ఇది’’ అని ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఉస్మాన్‌ ఖవాజా ట్వీట్‌ చేశాడు.

హామిల్టన్‌ మాటల్ని ఉటంకించిన మాంటీ పనేసర్‌..
‘‘కచ్చితంగా.. నేను ఏమాత్రం సంతోషంగా లేను. నా పట్ల ఎలా వ్యవహరించాలనుకున్నారో వాళ్లు అలాగే వ్యవహరించారు. దృఢ సంకల్పంతో నేను తిరిగి వస్తాను’’ అని మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయీస్‌ హామిల్టన్‌ మాటల్ని ఉటంకిస్తూ ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మాంటీ పనేసర్‌ అతడికి మద్దతు పలికాడు. 

నిజంగా ఇది ఏమాత్రం సరికాదు..
‘‘ఇద్దరు డ్రైవర్లు... రెండు జట్లు... అయినా ఇది సరికాదు... ఏం మాట్లాడాలో అర్థంకాలేదు’’ అని ఇంగ్లండ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ టిమ్‌ బ్రెస్నన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు.

చదవండి: ODI Captaincy: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఏంటి.. లేకపోతే ఏంటి?జరిగేది అదే: గంభీర్‌

>
మరిన్ని వార్తలు