భీకరమైన ఫామ్‌; మెగా టోర్నీలో 5 సెంచరీలు.. నేటితో రెండేళ్లు

6 Jul, 2021 13:24 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: టీమిండియా ఓపెనర్‌.. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 2019 ప్రపంచకప్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీలు కాదని డబుల్‌ సెంచరీలను మంచీనీళ్ల ప్రాయంగా మలిచిన రోహిత్‌ ఆ మెగా టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు బాది ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. అప్పటివరకు ఒక ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార సంగక్కర పేరిట ఉండేది. రోహిత్‌ ఆ రికార్డును చెరిపేస్తూ కొత్త చరిత్రను సృష్టించాడు. రోహిత్‌ ఆ రికార్డు సాధించి నేటితో సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భంగా అప్పటి ఆసక్తికర విషయాలను ఒకసారి గుర్తుచేసుకుందాం. 


లీగ్‌ దశలో న భూతో భవిష్యత్తు అనేలా రోహిత్‌ ఆటతీరు సాగింది. కొడితే భారీ స్కోర్లు ఖాయం అనేలా అతని ఇన్నింగ్స్‌లు సాగాయి. లీగ్‌ దశలో దక్షిణాఫ్రికాపై 122* పరుగులు, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై 140 పరుగులు‌‌, ఇంగ్లండ్‌పై 102, బం‍గ్లాదేశ్‌పై 104 పరుగులు చేశాడు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 103 పరుగులతో శతకం సాధించిన రోహిత్‌ ఒక మేజర్‌ టోర్నీలో అత్యధిక సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అయితే ఆఫ్గానిస్తాన్‌, వెస్టిండీస్‌లపై మాత్రం విఫలమైన రోహిత్‌ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 57 పరగులు చేశాడు. రోహిత్‌ జోరుతో టీమిండియా మరోసారి విజేతగా నిలుస్తుందని అంతా భావించారు.


కానీ రోహిత్‌ ఇదే టెంపోనూ కివీస్‌తో జరిగిన సెమీఫైనల్లో చూపెట్టలేకపోయాడు. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ ఒక్క పరుగుకే వెనుదిరగడంతో అభిమానుల ఆశలు గల్లంతయ్యాయి. అయితే రోహిత్‌ ఇదే ప్రపంచకప్‌లో మరో రికార్డును కూడా సాధించాడు. ఒక్క ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్‌ మూడో స్థానంలో నిలిచాడు. మొత్తంగా రోహిత్‌ శర్మ ఐదు సెంచరీల సాయంతో 648 పరుగులు చేశాడు. అంతకముందు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌(673 పరుగులు, 2003 ప్రపంచకప్‌), ఆసీస్‌ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్‌( 659 పరుగులు, 2007 ప్రపంచకప్‌) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అంతేగాక టీమిండియా తరపున సచిన్‌ తర్వాత ఒక ప్రపంచకప్‌లో 600 పైచిలుకు పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్‌ నిలవడం విశేషం.

మరిన్ని వార్తలు