అది బీసీసీఐ-రోహిత్‌లకు మాత్రమే తెలుసు: సచిన్‌

10 Dec, 2020 10:33 IST|Sakshi
రోహిత్‌ శర్మ(ఫైల్‌ఫోటో)

ముంబై: రోహిత్‌ శర్మ తన సహచరులతో పాటు ఆస్ట్రేలియాకు వెళ్లకపోవడానికి ఫిట్‌నెస్‌ సమస్య కారణం కాదని బీసీసీఐ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రోహిత్‌ విషయంలో వరుస వివాదాలు, కోహ్లి వ్యాఖ్యల నేపథ్యంలో బోర్డు ఇచ్చిన వివరణ ఆసక్తిని పెంచింది.  తన తండ్రి అనారోగ్యంగా ఉన్న కారణంగానే రోహిత్‌ ఐపీఎల్‌ తర్వాత నేరుగా ముంబైకి వచ్చాడని,  ఇప్పుడు ఆయన కోలుకున్నారు కాబట్టి ఎన్‌సీఏకు వెళ్లి తన రీహాబిలిటేషన్‌ను ప్రారంభించాడని తెలిపింది. కాగా, రోహిత్‌ ఫిట్‌నెస్‌గా ఉన్నాడా.. లేదా అనేది అతనితో పాటు బోర్డుకు మాత్రమే తెలియాలని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ అంటున్నాడు. ఒకవేళ రోహిత్‌ ఫిట్‌నెస్‌ సాధిస్తే మాత్రం ఆస్ట్రేలియాకు పంపాలని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సూచించాడు. (త్యాగి బౌన్సర్‌.. కుప్పకూలిన ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌)

తనకైతే రోహిత్‌ శర్మ ఫిట్‌నెస్‌ గురించి తెలియదని, వంద శాతం ఫిట్‌నెస్‌తో ఉంటే మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు పంపడం ఉత్తమం అన్ని పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ నాణ్యమైన ఓపెనర్‌ అని, అతను ఉంటే  జట్టు సమతూకంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ‘ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టులో రోహిత్‌ శర్మ ఉంటే బాగుంటుంది. రోహిత్‌ ఫిట్‌నెస్‌ పరంగా నిరూపించుకుంటే మాత్రం మరో ఆలోచన లేకండా ఆస్ట్రేలియాకు పంపండి. రోహిత్‌ ఫిట్‌నెస్‌ స్టాటస్‌ అయితే నాకు తెలీదు. అది నా వ్యవహారం కూడా కాదు. ఆ విషయం బీసీసీఐ-రోహిత్‌లకు మాత్రమే తెలుస్తుంది. వారివురూ టచ్‌లో ఉన్నారు కాబట్టి ఫిట్‌నెస్‌ ఏమిటనేది వారికే తెలుస్తుంది. ఇక ఫిజియో-టీమ్‌ మేనేజ్‌మెంట్‌ ఎప్పటికప్పుడు రోహిత్‌ ఫిట్‌నెస్‌ను పర్యవేక్షిస్తోంది. దీనికి వారే సమాధానం చెప్పాలి. నేను చెప్పేది మీకు తెలియజేసేది ఒక్కటే..రోహిత్‌ 100 శాతం ఫిట్‌నెస్‌ను సాధిస్తే మాత్రం ఆస్ట్రేలియా పర్యటనకు పంపడం చాలా మంచిది. అతని సత్తా ఏమిటో మనకు తెలుసు. నాలుగు టెస్టుల సిరీస్‌కు రోహిత్‌ ఉంటే జట్టు సమతూకంగా ఉంటుంది’ అని సచిన్‌ తెలిపాడు. (టీమిండియాకు మరో షాక్‌)

>
మరిన్ని వార్తలు